Rahul Gandhi helicopter: జార్ఖండ్‌లోని గొడ్డాలో చిక్కుకున్న రాహుల్ గాంధీ హెలికాప్టర్.. లభించని ఏటీసీ క్లియరెన్స్
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నిలిచిపోయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) నుంచి అనుమతులు రాకపోవడంతో దాదాపు గంటపాటు ఆగిపోవడంతో రాహుల్ గాంధీ షెడ్యూల్‌లో ఆటంకం ఏర్పడింది. ఈ ఘటన ఎన్నికల చివరి విడత ప్రచారంలో భాగంగా గొడ్డాలో ర్యాలీని ముగించుకున్న తర్వాత చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ వేరే ప్రాంతానికి వెళ్లేందుకు బయల్దేరినపుడు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతులు రాలేదు. దీంతో హెలికాప్టర్ ఆగిపోయింది.
20న మహారాష్ట్రతో పాటు జార్ఖండ్‌లో రెండో విడత ఎన్నికలు
కాంగ్రెస్ పార్టీ ఈ సంఘటనపై బీజేపీపై తీవ్ర విమర్శలు చేసింది. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారానికి ఆటంకం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా ఈ చర్య తీసుకున్నారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విమర్శలపై బీజేపీ స్పందించింది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నట్లు వ్యాఖ్యానించింది. అసలు హెలికాప్టర్ ఆలస్యానికి గల కారణాలను ఇంకా వెల్లడించలేదు. అనుమతులు రాకపోవడంతో హెలికాప్టర్‌లోనే రాహుల్ గాంధీ ఉండిపోయారు. నవంబర్ 13న తొలి విడత పోలింగ్ జరిగగా, 20న మహారాష్ట్రతో పాటు జార్ఖండ్‌లో రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి.