DK Shivakumar: 'వేచి ఉండండి'.. కర్ణాటక సీఎం మార్పు ఊహాగానాలు మధ్య రాహుల్ గాంధీ డికె శివకుమార్‌కు మెసేజ్
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలో ముఖ్యమంత్రి అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ స్వయంగా వ్యవహారంలోకి దిగారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇద్దరూ అధిష్ఠానం నిర్ణయమే అంతిమమని చెబుతున్నప్పటికీ, ఆ పదవి కోసం తమ వర్గాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు రాజకీయ వర్గాల విశ్లేషణ. ఇదే సమయంలో రాహుల్ గాంధీ నుంచి డీకే శివకుమార్‌కు వచ్చిన సందేశం కొత్త చర్చలకు దారితీసింది. రాహుల్ గాంధీ విదేశాల్లో ఉన్న సమయంలోనే CM మార్పుపై ఊహాగానాలు జోరెక్కాయి. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ నేరుగా రాహుల్‌తో మాట్లాడాలని ప్రయత్నించినట్టు పార్టీకి దగ్గర వర్గాలు చెబుతున్నాయి.
వివరాలు
మరోసారి ఢిల్లీ వెళ్లనున్న డీకే శివకుమార్
అయితే 'కొద్దిసేపు వేచి ఉండండి, నేను స్వయంగా మీకు కాల్ చేస్తాను' అని రాహుల్ గాంధీ సందేశం పంపినట్టు సమాచారం బయటికి వచ్చింది. సిద్ధరామయ్య పూర్తి కాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతారని డీకే శివకుమార్ బహిరంగంగా చెబుతున్నప్పటికీ, ఆయన మాత్రం ముఖ్యమంత్రి పదవిని అందుకునేందుకు సైలెంట్‌గా కదలికలు కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్న ఆయన, సోనియా గాంధీని కూడా కలిసి మాట్లాడాలని యోచిస్తున్నట్టు వార్తలు సూచిస్తున్నాయి.
వివరాలు
మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ త్వరలో ప్రత్యేక సమావేశం
కర్ణాటక నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలను ఢిల్లీ కాంగ్రెస్ అగ్రనేతలు ఖండించారు. ఈ రూమర్లకు పూర్తిగా తెరపడాలంటే తగిన చర్యలు తీసుకోవాలని సిద్ధరామయ్య కూడా అధిష్ఠానాన్ని కోరినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో డిసెంబర్ 1 లోపు హైకమాండ్ స్పష్టమైన నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారని తెలిసింది.