Manmohan singh: పాడె మోసిన రాహుల్ గాంధీ.. ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు దిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి. పార్థివ దేహానికి త్రివిధ దళాలు నివాళులర్పించగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాడె మోశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా తదితరులు హాజరై తుది వీడ్కోలు పలికారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, భారాస నేత కేటీఆర్, భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ వాంగ్‌చుక్, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు.
పదేళ్లపాటు ప్రధానిగా సేవలందించిన మన్మోహన్
పార్టీ కార్యకర్తలు, నేతల సందర్శనార్థం పార్థివదేహాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు. రాహుల్, సోనియా, ప్రియాంకతో పాటు పలువురు నాయకులు నివాళులర్పించారు. అక్కడి నుంచి నిగమ్‌బోధ్ ఘాట్ వరకు అంతిమయాత్ర నిర్వహించారు. మన్మోహన్ సింగ్ వయోభారంతో గురువారం రాత్రి స్పృహ కోల్పోయి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన పదేళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించగా, పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా, ఆర్‌బీఐ గవర్నర్‌గా కూడా పని చేశారు. ఆర్థిక విధానాలకు బలమైన మార్పులు తీసుకురావడంలో, భారత అభివృద్ధి దిశగా కీలక పాత్ర పోషించడంలో మన్మోహన్ సింగ్ చేసిన సేవలు ఎనలేనివి.