Page Loader
సీసీ కెమెరా నిఘాలో రైల్వే కోచ్‌లు.. ఇక రైలు ప్రయాణం మరింత భద్రం
సీసీ కెమెరా నిఘాలో రైల్వే కోచ్‌లు

సీసీ కెమెరా నిఘాలో రైల్వే కోచ్‌లు.. ఇక రైలు ప్రయాణం మరింత భద్రం

వ్రాసిన వారు Stalin
Dec 31, 2022
01:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

రైళ్లలో ప్రయాణించే మహిళలు, చిన్నారుల భద్రతను మరింత పెంచేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 15,000 కోచ్‌లను సీసీ కెమెరాల నీడలోకి తేనుంది. ఇందుకోసం కేంద్రం రూ. 705 కోట్లను కేటాయించింది. రాజధాని, దురంతో, శతాబ్ది వంటి ప్రీమియం రైళ్లలోని 14, 387 కోచ్‌లతో పాటు ఈఎంయూ, ఎంఈఎంయూ, డీఈఎంయూ ప్యాసింజర్ ట్రైన్లలో కూడా ఈ సీసీ కెమెరాలను అమర్చనున్నారు. 2,930 రైలు కోచ్‌లు సీసీ కెమెరాల నిఘాలో ఉన్నట్లు గత ఏడాది రైల్వే మంత్రిత్వ శాఖ పార్లమెంట్‌కు తెలిపింది. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను దాదాపు ఐదు రెట్లు పెంచింది కేంద్రం.

సీసీ కెమెరాలు

అత్యాధునిక సాంకేతికతతో కూడిన కెమెరాలు..

రైళ్లలో వీడియోలు, ఫేస్‌లను కచ్చితంగా గుర్తించే అత్యాధునిక సాంకేతికతతో కూడిన సీసీటీవీలను అమర్చనున్నారు. తద్వారా డివిజనల్, జోనల్ ప్రధాన కార్యాలయాల నుంచి రిమోట్ ఆపరేషన్ ద్వారా అన్ని కోచ్‌లను ఆర్పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షించడం సులభం కానుంది. ప్రయాణించే క్రమంలో రైళ్లలో ఎలాంటి సంఘటన జరిగినా.. కొత్తగా అమర్చనున్న సీసీ కెమెరాలతో నియంత్రించడానికి తేలిక అవుతుంది. ఈ సీసీ కెమెరాలు హై రిజల్యూషన్ చిత్రాలను అందించడం వల్ల.. దుండగులను గుర్తించడం చాలా ఈజీ అవుతుంది. భవిష్యత్‌లో విద్యుత్ ప్రమాదాలకు తావు లేకుండా.. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని.. ఈ సీసీ కెమెరాలను అమర్చనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.