Diwali Train Travel Rules: ప్రయాణికులకు రైల్వే శాఖ హెచ్చరిక.. రైళ్లలో టపాసులు తీసుకెళ్తే మూడేళ్ల జైలు!
ఈ వార్తాకథనం ఏంటి
దీపావళి పండుగ, వారాంతపు సెలవుల నేపథ్యంలో రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యం, భద్రతకు సంబంధించి కీలక చర్యలు చేపట్టింది. పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరోవైపు రైళ్లలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తనిఖీలను ముమ్మరం చేసింది. ముఖ్యంగా ప్రయాణికులు బాణసంచా, టపాసులు, ఇతర ప్రమాదకరమైన వస్తువులను రైళ్లలో తీసుకెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
వివరాలు
రైళ్లలో టపాసులు తీసుకెళ్తే జైలుశిక్ష
దీపావళి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులు రైళ్లలో బాణసంచా, టపాసులు లేదా ఇతర ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లడం చట్టరీత్యా నేరమని దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్, సీపీఆర్‌వో వై. బాలాజీ కిరణ్ స్పష్టం చేశారు.
రైల్వే చట్టం-1989 నిబంధనల ప్రకారం.. రైలు ప్రయాణాల్లో పేలుడు పదార్థాలు, బాణసంచా, గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, కిరోసిన్, యాసిడ్ వంటి మండే స్వభావం కలిగిన వస్తువులను రవాణా చేయడం నిషేధం.
ఈ నిబంధనలను ఉల్లంఘించి బాణసంచా లేదా ఇతర ప్రమాదకర వస్తువులను తీసుకెళ్లే వారికి మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.
వివరాలు
రైల్వే స్టేషన్లు, రైళ్లలో ముమ్మర తనిఖీలు
పండుగ వేళ రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫారమ్‌లు, రైళ్లలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దించారు.
ఆర్పీఎఫ్ (RPF), జీఆర్పీ (GRP), సివిల్ డిఫెన్స్ సిబ్బందితో పాటు టీటీఈలు, కోచ్ అటెండెంట్లు, స్టేషన్ మేనేజర్లు తనిఖీల్లో పాల్గొంటున్నారు.
రైళ్లతో పాటు పార్సిల్ వ్యాన్లు, ప్రయాణికుల లగేజీలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా నిషేధిత లేదా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకునేలా భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు.
ప్రయాణ సమయంలో ఎవరైనా బాణసంచా లేదా అనుమానాస్పద వస్తువులను తీసుకెళ్తున్నట్లు గమనిస్తే వెంటనే రైల్వే టోల్ ఫ్రీ నంబర్ 139కు కాల్ చేసి సమాచారం అందించాలని అధికారులు ప్రయాణికులను కోరారు.
వివరాలు
విశాఖపట్నం-పార్వతీపురం మధ్య ప్రత్యేక రైలు
మరోవైపు దీపావళి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం-పార్వతీపురం మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నారు. రైలు నంబర్లు 07268, 07267తో ఈ ప్రత్యేక రైలు నవంబర్ 7, 8, 9 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.
విశాఖపట్నం నుంచి పార్వతీపురం: రైలు నంబర్ 07268 ఉదయం 10 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి మధ్యాహ్నం 12.25 గంటలకు పార్వతీపురం చేరుకుంటుంది.
పార్వతీపురం నుంచి విశాఖపట్నం: రైలు నంబర్ 07267 మధ్యాహ్నం 12.35 గంటలకు పార్వతీపురంలో బయలుదేరి సాయంత్రం 4 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
వివరాలు
నియమాలను పాటించాలి
ఈ ప్రత్యేక రైలు ప్రయాణంలో సింహాచలం, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, కోమటిపల్లి, దొంకినవలస, బొబ్బిలి, సీతానగరం, నర్సీపురం స్టేషన్లలో ఆగుతుంది.
దీపావళి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ప్రత్యేక రైలు సేవలను వినియోగించుకోవాలన్నారు.
అదే సమయంలో రైళ్లలో ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లకుండా భద్రతా నిబంధనలను పాటించాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.