OTP For Tatkal tickets: రైల్వే శాఖ కొత్త నిర్ణయం..కౌంటర్ తత్కాల్ టికెట్లకు ఓటీపీ తప్పనిసరి
ఈ వార్తాకథనం ఏంటి
తత్కాల్ టికెట్ల వ్యవస్థలో మరొక కీలక మార్పును అమలు చేయడానికి రైల్వే శాఖ (Ministry of Railways) సిద్ధమవుతోంది. ఇకపై రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా తీసుకునే తత్కాల్ టికెట్లకు తప్పనిసరిగా వన్‌టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) పద్ధతిని ప్రవేశపెట్టనుంది. తత్కాల్ బుకింగ్ సమయంలో జరుగుతున్న అక్రమాల్ని నియంత్రించడానికి ఈ కొత్త నిబంధనను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఓటీపీ ఆధారిత టికెట్ బుకింగ్ విధానాన్ని రైల్వే శాఖ నవంబర్ 17 నుంచే ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. మొదట కొద్ది రైళ్లకు మాత్రమే దీనిని వర్తింపజేసి, తర్వాత దశలవారీగా 52 రైళ్లకు విస్తరించింది.
వివరాలు
రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థను మరింత పారదర్శకంగా బలోపేతం
సమీప భవిష్యత్‌లో ఈ విధానాన్ని అన్ని రిజర్వేషన్ కౌంటర్లకు అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ యోచిస్తోందని అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త విధానం ప్రకారం, కౌంటర్ వద్ద రిజర్వేషన్ ఫారం నింపిన అనంతరం బుకింగ్ ప్రక్రియలో ప్రయాణికుడి మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసినప్పుడే టికెట్ జారీ అవుతుంది. ఇటీవల కాలంలో రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థను మరింత పారదర్శకంగా బలోపేతం చేసే దిశగా కేంద్ర రైల్వే శాఖ పలు మార్పులు చేపట్టింది.
వివరాలు
ఆన్‌లైన్ తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్
అక్రమ దందాలకు చెక్ పెట్టి, నిజమైన ప్రయాణికులకు సముచిత న్యాయం చేకూర్చడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా జులై నెల నుండి ఆన్‌లైన్ తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్‌ను తప్పనిసరిగా అమలు చేసింది. ఇకపై అక్టోబర్ మొదలు సాధారణ రిజర్వేషన్ టికెట్ల విషయంలో కూడా తొలి 15 నిమిషాల పాటు ఆధార్ ధృవీకరణ పూర్తయిన యూజర్లకే బుకింగ్‌కు అవకాశం కల్పిస్తోంది.