Sankranti Special Trains 2026: సంక్రాంతి రద్దీకి రైల్వే ప్లాన్.. హైదరాబాద్-విజయవాడ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లు
ఈ వార్తాకథనం ఏంటి
సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్-విజయవాడ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లను (Sankranti Special Trains 2026) నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. పండగ ముందు, తర్వాత రోజుల్లో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఛైర్‌కార్, జనరల్ బోగీలతో ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.
Details
సగానికి పైగా జనరల్ బోగీలను ఏర్పాటు
రైల్వే అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 11, 12, 13, 18, 19 తేదీల్లో ఉదయం 6.10 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక రైళ్లు బయలుదేరనున్నాయి. అలాగే ఈ నెల 10, 11, 12, 17, 19 తేదీల్లో మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఛైర్‌కార్ బోగీలకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించారు. అలాగే రిజర్వేషన్ చేయించుకోని ప్రయాణికుల కోసం సగానికి పైగా జనరల్ బోగీలను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సంక్రాంతి పండగ సందర్భంగా స్వస్థలాలకు వెళ్లే, తిరిగివచ్చే ప్రయాణికులకు ఈ ప్రత్యేక రైళ్లు ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నాయి.