IMD Warning: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. పలు రాష్ట్రాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాల హెచ్చరిక!
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని పలు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అకస్మాత్తుగా సంభవిస్తున్న తుఫానులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల రాజస్థాన్‌లో శనివారం సంభవించిన భారీ ఇసుక తుఫాన్ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ (IMD) కీలక హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని వాయువ్య భారత ప్రాంతాలను వెస్ట్రన్ డిస్టర్బెన్స్ ప్రభావితం చేస్తోందని భారత వాతావరణ శాఖ శాస్త్రవేత్త అఖిల్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ ప్రభావం కారణంగా పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు వెల్లడించారు.
వివరాలు
క్రమంగా తగ్గుతున్న్ ఉష్ణోగ్రతలు
గత రెండు నుంచి మూడు రోజులుగా మైదాన ప్రాంతాలు, తూర్పు భారతదేశం, మధ్య భారత ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నిరంతరంగా కురుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయని వివరించారు. అదేవిధంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల వాతావరణ విభాగాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించారు.
వివరాలు
కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు
ఇక పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అలాగే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని హిమాలయ ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దక్షిణ పశ్చిమ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా రానున్న రోజుల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా ముందుకు సాగుతున్నాయని తెలిపింది.
వివరాలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ, తమిళనాడు, లక్షద్వీప్‌లోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్త అఖిల్ శ్రీవాస్తవ వెల్లడించారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారుల సూచనలను పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.