Rain Alert: తెలంగాణలో నేడు పలు జిల్లాలకు ఉరుములతో కూడిన వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో మంగళవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు,ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే పరిస్థితులు ఏర్పడినట్లు తెలిపింది. ఈ ప్రభావంతో ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
వివరాలు
సిర్పూర్ (యు)లో 10.1 సెంటీమీటర్ల వర్షపాతం
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు పలుచోట్ల భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది.
అత్యధికంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు)లో 10.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అలాగే నల్గొండ జిల్లా కట్టంగూరులో 8.2 సెంటీమీటర్లు, నిజామాబాద్ గ్రామీణ మండలంలోని మల్కాపూర్‌లో 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.