
Hyderabad Floods: హైదరాబాద్‌లో వర్షం బీభత్సం.. పునరావాస కేంద్రాలకు ప్రజల తరలింపు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ మహానగరంలో కురిసిన భారీ వర్షం కారణంగా చాదర్‌ఘాట్, శంకర్‌నగర్, మూసారాంబాగ్ ప్రాంతాలు తీవ్రంగా నీట మునిగిపోయాయి. వరద స్థాయి క్రమంగా పెరుగుతుండటంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో స్థానికులు తమ ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. చాదర్‌ఘాట్, మలక్‌పేట ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదే సమయంలో ఎంజీబీఎస్ బస్టాండ్ కూడా నీట మునిగిపోవడంతో దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Details
నదీ తీర ప్రాంతాలకు ప్రజలు వెళ్లొద్దని హెచ్చరిక
బస్టాండ్‌లో చిక్కుకున్న ప్రయాణికులను పోలీసులు, హైడ్రా సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువస్తున్నారు. ఎంజీబీఎస్ బస్ డిపో ఫ్లైఓవర్ నుంచి చాదర్‌ఘాట్ వరకు మూసీ నదిలో భారీగా నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు, జీహెచ్‌ఎంసీ, డిజాస్టర్ రిస్పాన్స్ టీమ్స్, నీటి పారుదల శాఖ అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. నీటి మట్టాలు తగ్గే వరకు లోతట్టు ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాలకు వెళ్లరాదని ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Details
నీట మునిగిన పురానాపూల్ శివాలయం
ఇక, జియాగూడ, పురానాపూల్ ప్రాంతాలు కూడా భారీ వరద నీటితో మునిగిపోయాయి. ఈ రూట్లను అధికారులు ఇప్పటికే మూసివేశారు. మూసీ పరివాహక ప్రాంతమైన జియాగూడ బస్తీలు, కాలనీల్లోకి నీరు చేరడంతో అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. పురానాపూల్‌లోని శివాలయం కూడా నీట మునిగిపోయింది. ఆలయంలో ఉన్న పూజారి కుటుంబం బయటకు రాలేక, సహాయం కోసం ఆలయ పైకప్పుకు ఎక్కి కేకలు వేసిన ఘటన చోటుచేసుకుంది.