Rains in Hyderabad-Cool weather: హైదరాబాద్ లో చల్లబడిన వాతావరణం
హైదరాబాద్(Hyderabad)వాసులకు వేసవి(Summer)తాపం నుంచి కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్ లో వాతావరణం కాస్త చల్లబడింది. సుమారు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అయిపోయిన నగరవాసులకు శనివారం వాతావరణం కాస్త చల్లబడటంతో ఉపశమనం లభించినట్లైంది. కాగా రాష్ట్రంలో కూడా పలు చోట్ల వర్షాలు (Rains) కురుస్తున్నట్లు సమాచారం. అబిడ్స్, చిక్కడపల్లి, హిమాయత్ నగర్, , అమీర్ పేట, మొహిదీపట్నం, రాజేంద్రనగర్, అత్తాపూర్, బంజారాహిల్స్, చంపాపేట, చైతన్యపురి, సరూర్నగర్, సైదాబాద్, శంషాబాద్, ఆదిభట్ల, నాంపల్లి, మలక్ పేట, చార్మినార్, దిల్ సుఖ్ నగర్, వనస్థలిపురం, కాచిగూడ, జల్ పల్లి లో మోస్తరు వర్షం కురిసింది.వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ఉదయం కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు కొంచెం ఇబ్బంది పడ్డారు.
ముందే చెప్పిన వాతావరణ శాఖ
రాగల రెండు మూడు రోజుల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ముందే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నెల 20 నుంచి 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని కూడా ముందే హెచ్చరించిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం వేళల్లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా మహిళలు, వృద్ధులు బయటకు వెళ్లవద్దని కూడా హెచ్చరించింది. శుక్రవారం నిజమాబాద్ జిల్లాలో లోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. డిచ్ పల్లి, ఇందల్వాయి మండలాల్లో వడగళ్ల వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి, రామా రెడ్డి మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడటంతో వేసవి తాపం నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది.