Rajahmundry: రాజమండ్రి కల్తీ పాల కేసు.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన రాజమహేంద్రవరం కల్తీ పాల మరణాల కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం పాలు కాకుండా వాటిలో కలిపిన అత్యంత ప్రమాదకర రసాయనం అని ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహించిన ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL), అలాగే ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (RFSL) తమ తుది నివేదికలను సమర్పించాయి. బాధితులు తాగిన పాలలో పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే ఇథిలీన్ గ్లైకాల్ (Ethylene Glycol) అనే రసాయనం కలిసినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ కెమికల్ శరీరంలోకి వెళితే కిడ్నీలను తీవ్రంగా దెబ్బతీసి ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందని నివేదికలో పేర్కొన్నారు.
Details
ఇప్పటివరకూ 10మంది మృతి
ఈ విషపూరిత రసాయనం కారణంగా బాధితుల కిడ్నీలతో పాటు శరీరంలోని ఇతర కీలక అవయవాలు కూడా పనిచేయకపోవడం వల్ల పరిస్థితి విషమంగా మారింది. ఇప్పటివరకు ఈ ఘటనలో 10 మంది మరణించగా, మరో 10 మంది తీవ్ర స్థితిలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనకు కారణమయ్యాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పాల వ్యాపారి అడ్డాల గణేశ్వరరావుపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినందుకు అతనిపై ఇప్పటికే 9 క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఈ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీస్తుండగా, ప్రతిరోజూ వినియోగించే పాల నాణ్యతపై ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.