Rajasthan Cylinder Price: జనవరి 1 నుంచి రూ.450కే అక్కడ గ్యాస్ సిలిండర్..
భారతదేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు రూ.1000 దాటుతున్నాయి. ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఇదే అంశం ఎన్నికల్లో ప్రధానస్త్రంగా మారింది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు తాము గెలిస్తే తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్‌ను రాయితీలపై అందిస్తామని హామీలు గుప్పించాయి. ఈ క్రమంలోనే గెలిచి అధికారంలోకి వచ్చాక వాటి అమలు కోసం తీవ్ర కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ కొత్త సంవత్సర కానుక ప్రకటించారు. జనవరి 1 నుంచి రూ.450 కే గ్యాస్ సిలిండర్ అందించనున్నట్లు తెలిపారు. 2024 జనవరి1 నుంచి రాజస్థాన్‌లో అర్హులైన లబ్ధిదారులకు రూ.450కే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు.రాజస్థాన్‌లో ఉజ్వల పథకం కింద అర్హులైన వారికి రాయితీ సిలిండర్ పంపిణీ చేస్తామన్నారు.
రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీ అమలు
అయితే గతంలో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించింది. తాజాగా అధికారంలోకి వచ్చిన భజన్ లాల్ శర్మ నేతృత్వంలోని బీజేపీ మరో రూ.50 రాయితీ ప్రకటించింది. దీంతో రూ.450కే ఉజ్వల పథకం లబ్దిదారులు గ్యాస్ సిలిండర్‌ను లబ్ధిదారులు పొందనున్నారు. బుధవారం టోంక్‌లో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్న సీఎం భజన్‌లాల్ శర్మ ఈ విషయాన్ని ప్రకటించారు. రాజస్థాన్ వాసులకు నూతన సంవత్సర కానుక అని స్పష్టం చేశారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో భాగంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు.