
Raj bhavan: అమరావతిలో రూ.212 కోట్ల అంచనా వ్యయంతో రాజ్ భవన్ నిర్మాణానికి సీఆర్‌డీఏ ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
అమరావతిలో రాజధాని నిర్మాణానికి భూములు త్యాగం చేసిన రైతులు కొత్త నగర అభివృద్ధి ప్రయోజనాలను పంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు సీఆర్‌డీఏ అథారిటీ 53వ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన,భూముల దాతలకు తిరిగి ఇవ్వవలసిన ప్లాట్ల నమోదును వేగవంతంగా పూర్తి చేయమని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో మొత్తం 18అంశాలను చర్చించారు. "రాజధాని నిర్మాణ పనులను మళ్లీ ప్రారంభించాం.భూములు అందించిన రైతులు ముందుగా అభివృద్ధి లబ్ధి పొందాలి. వారికి భూముల బదులు చెల్లింపులో ఆలస్యం జరగకూడదు. తిరిగి కేటాయించే ప్లాట్లు భూములు సేకరించిన గ్రామాల్లోనే ఉండాలి. సచివాలయ టవర్స్ మరియు ఇతర భవన నిర్మాణాలు త్వరగా పూర్తి కావలసిన అవసరం ఉంది.అందుకే పనులు వేగవంతం చేయాలి" అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
వివరాలు
ముఖ్య నిర్మాణ, రోడ్డు పనులు
వెస్ట్ బైపాస్ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించమని, సాంకేతిక సమస్యలను పరిష్కరించి కాజా టోల్ గేట్ సమీపంలో రాష్ట్రీయ రహదారి (NH)తో రోడ్డు కనెక్టివిటీని నిర్ధారించమని సీఎం ఆదేశించారు. కరకట్ట రోడ్డును విస్తరించాలి. మూడు నెలల్లో రాజధాని నగర రూపుదిద్దుకోవడం ప్రారంభించాలి అని ఆయన తెలిపారు. అమరావతిలో ₹212 కోట్ల అంచనా వ్యయంతో రాజ్ భవన్ నిర్మాణానికి సీఆర్‌డీఏ ఆమోదం ఇచ్చింది. ఇది కృష్ణా నది ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో నిర్మించబడనుంది. ముఖ్యమంత్రి నిర్మాణానికి అద్భుతమైన రూపకల్పన చేయాలని ఆదేశించారు.
వివరాలు
మునిసిపల్,ఇతర అభివృద్ధి ప్రాజెక్టులు
మంగళగిరి, తాడేపల్లి మునిసిపల్ ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీ పనులకు ఖర్చులో 25% నిధులను కేటాయించారు. రాజధాని ప్రాంతంలో నాలుగు కన్వెన్షన్ సెంటర్లు నిర్మించడానికి ఆమోదం లభించింది. గ్రీన్-సర్టిఫైడ్ భవనాలను నిర్ధారించడానికి జోనింగ్ నిబంధనలలో సవరణకు ఆమోదం వచ్చింది. ప్రతిపాదిత అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ కు కార్యనిర్వాహక సంస్థగా సీఆర్‌డీఏ నియమితమైంది. హ్యాపీ నెస్ట్, AP NRT ప్రాజెక్టులకు భవన నిర్మాణ అనుమతి రుసుములను రద్దు చేయడానికి ఆమోదం ఇచ్చారు.
వివరాలు
హోటళ్లు, పార్కింగ్, నీటి నిర్వహణ
రాజధాని ప్రాంతంలోని హోటళ్లకు పార్కింగ్ నిబంధనల్లో స్వల్ప సడలింపులు చేయమని అనుమతించారు. కొండవీడు వాగు సమీపంలో 8,400 క్యూసెక్కుల సామర్థ్యంతో కొత్త పంపింగ్ స్టేషన్ ఏర్పాటుకు సీఆర్‌డీఏ ఆమోదం ఇచ్చింది. ఈ నిర్ణయంతో అనేక సాంకేతిక, పరిపాలనా సమస్యలు పరిష్కరించబడ్డాయి.
వివరాలు
భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలు
వాహనాల సంఖ్య పెరుగుతుందని దృష్టిలో ఉంచుకుని, ముందస్తు పార్కింగ్ ప్రణాళికలు రూపొందించమని సీఎం సూచించారు. అమరావతిలో ఉమ్మడి పార్కింగ్ హబ్‌లు ఏర్పాటు చేయాలని, ఆన్-రోడ్ పార్కింగ్‌ను నిరోధించాలని తెలిపారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లు, తెనాలి మునిసిపాలిటీలను రాజధాని ప్రాంతంతో అనుసంధానించి వాటిని బ్లూ-గ్రీన్ అమరావతిగా అభివృద్ధి చేయాలని సూచనలిచ్చారు.