Ram Mandir SIT Probe: అయోధ్య రామందిరం నిధుల వివాదం..ఎవరు ఏమన్నారంటే? SIT ఏం తేల్చబోతోంది?
ఈ వార్తాకథనం ఏంటి
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిరానికి భక్తులు సమర్పించిన విరాళాలు, నగదు, బంగారం, వెండి ఆభరణాల నిర్వహణలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ చేపట్టగా, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తాజాగా తీవ్ర విమర్శలు చేశారు. కన్నౌజ్ పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడిన అఖిలేష్ యాదవ్, నిజాలు బయటకు రాకుండా చేయడానికే SIT దర్యాప్తును కావాలనే ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు సమయం కల్పిస్తున్నారంటూ ఆయన సామాజిక మాధ్యమాల్లో కూడా వ్యాఖ్యానించారు. దర్యాప్తు నివేదిక కూడా మాయమవకుండా జాగ్రత్త పడాలని వ్యంగ్యంగా పేర్కొన్నారు.
వివరాలు
SITని నియమించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల SIT బృందం అయోధ్యలో విస్తృతంగా విచారణ చేపట్టింది. ఐఏఎస్ అధికారి విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలోని బృందం ఆలయ రికార్డులను పరిశీలించడంతో పాటు ట్రస్ట్ సభ్యులు,ఆలయ సిబ్బందిని ప్రశ్నించింది. ప్రాథమిక విచారణ పూర్తికాగా,త్వరలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు నివేదిక సమర్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ వివాదం ప్రధానంగా భక్తులు సమర్పించిన విరాళాల నిర్వహణ చుట్టూనే తిరుగుతోంది. రామాలయానికి సమర్పించిన నగదు,బంగారం,వెండి,వజ్రాలు, ఇతర విలువైన వస్తువుల లెక్కల్లో తేడాలు ఉన్నాయని ఆరోపణలు వెలువడ్డాయి. అయితే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈ ఆరోపణలను గతంలోనే ఖండించింది. విరాళాల లెక్కింపు, ధృవీకరణ, భద్రపరచడం వంటి ప్రక్రియలు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని ట్రస్ట్ స్పష్టం చేసింది.
వివరాలు
దర్యాప్తు సమయంలో ఆలయ ట్రస్ట్ అధికారులు, సిబ్బంది అయోధ్యను వీడవద్దని SIT ఆదేశం
ఇదిలా ఉండగా, దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎవరూ నిరాధార వ్యాఖ్యలు చేయొద్దని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు. నిజానిజాలను నిర్ధారించడమే SIT బాధ్యత అని, ఎవరివద్దైనా ఆధారాలు ఉంటే దర్యాప్తు బృందానికి అందించాలని సూచించారు. దర్యాప్తు సమయంలో ఆలయ ట్రస్ట్ అధికారులు, సిబ్బంది అయోధ్యను వీడవద్దని SIT ఆదేశించినట్లు సమాచారం. ముఖ్యంగా భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాలు, వజ్రాలు తదితర విలువైన వస్తువుల రికార్డుల్లో కొన్ని వ్యత్యాసాలు గుర్తించినట్లు తెలుస్తోంది. వాటి నిల్వ, లెక్కలు, జాబితాల నిర్వహణపై పలువురు అధికారులు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయినట్లు వర్గాలు పేర్కొంటున్నాయి.
వివరాలు
మహాకుంభమేళా సమయంలో అయోధ్యకి దాదాపు 10 లక్షల మంది
2025 జనవరి-ఫిబ్రవరిలో జరిగిన మహాకుంభమేళా సమయంలో లక్షలాది మంది భక్తులు రామాలయాన్ని దర్శించుకున్నారని, రోజుకు దాదాపు 10 లక్షల మంది వరకు ఆలయానికి చేరుకున్నారని సమాచారం. ఆ సమయంలో విరాళాల పెట్టెలు గంటల వ్యవధిలోనే నిండిపోవడంతో నగదు, విలువైన వస్తువుల లెక్కల నిర్వహణలో లోపాలు జరిగి ఉండొచ్చనే అనుమానాలను SIT పరిశీలిస్తోంది. ఇంకా ఆలయ ట్రస్ట్ మార్కెట్ ధరల కంటే పలుమార్లు ఎక్కువ ధరలకు భూములు కొనుగోలు చేసిందనే ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ అంశాన్ని సమాజ్‌వాదీ పార్టీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గతంలో ప్రస్తావించింది.
వివరాలు
తిరుమల తిరుపతి దేవస్థానం తరహా పరిపాలనా విధానం
ఇక రామ మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా ఆలయ పరిపాలన కోసం స్వతంత్ర సీఈవోను నియమించాలని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తరహా పరిపాలనా విధానాన్ని అమలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో దేశంలోని అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటిగా ఎదుగుతున్న అయోధ్య రామాలయ నిర్వహణపై మరింత చర్చ మొదలైంది.