
Tahawwur Rana: ఎన్‌ఐఏ విచారణకు సహకరించని రాణా.. ముంబయి దాడులపై అస్పష్ట సమాధానాలు
ఈ వార్తాకథనం ఏంటి
26/11 ముంబయి ఉగ్రదాడికి సంబంధించి నిందితుడిగా గుర్తింపు పొందిన తహవ్వుర్ హుస్సేన్ రాణా ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కస్టడీలో ఉన్నాడు.
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నుంచి అతడిని ఇటీవలే భారత్‌కు తీసుకొచ్చిన నేపథ్యంలో ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతడిని విచారించారు.
విచారణ సుమారు 8 గంటల పాటు కొనసాగింది. అయితే ఈ విచారణకు రాణా పూర్తిగా సహకరించలేదని సమాచారం. అడిగిన ప్రశ్నలకు తప్పించుకునే రీతిలో సమాధానాలు ఇస్తూ, ఉగ్రదాడులతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా తన సంస్థ 'ఫస్ట్ వరల్డ్ ఇమిగ్రేషన్ సర్వీస్' చట్టబద్ధమైనదేనని, దానికి ఉగ్రవాద కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని రాణా స్పష్టం చేశాడు.
Details
మౌనం పాటిస్తున్న రాణా
తనపై ఉంచిన ఆరోపణలను ఖండించిన రాణా, విచారణలో సహకరించకుండా మౌనం పాటిస్తూ అస్పష్ట సమాధానాలు ఇచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
త్వరలోనే అతనిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. కాగా, న్యాయస్థానం గతంలో రాణాను 18 రోజుల పాటు కస్టడీలో ఉంచేలా ఎన్‌ఐఏకు అనుమతి ఇచ్చింది.
దాంతో ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేస్తూ, ముంబయి ఉగ్రదాడికి మద్దతుదారులను గుర్తించేందుకు చర్యలు చేపట్టింది.