Vijay: తమిళనాడు అసెంబ్లీలో అరుదైన దృశ్యం.. మంత్రుల వరుసలో కూర్చున్న సీఎం విజయ్
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ అసెంబ్లీలో అనూహ్యంగా తన ప్రత్యేక కుర్చీని వదిలి మంత్రుల వరుసలో కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయానికి భిన్నంగా ఆయన మంత్రులు కేఏ సెంగొట్టయాన్, ఆదవ్ అర్జున మధ్యలో ఆసీనులయ్యారు. మరోవైపు, కీలక చర్చల సమయంలో ఉన్నతాధికారులు సభకు హాజరుకావాలని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కోరారు.
వివరాలు
సీఎం కుర్చీని వదిలి మంత్రుల మధ్యకు..
అసెంబ్లీలో సాధారణంగా ముఖ్యమంత్రికి స్పీకర్ కుర్చీకి సమీపంలో ప్రత్యేకమైన, విశాలమైన సీటును కేటాయిస్తారు.
సీఎం పక్కనే మొదటి వరుసలో మంత్రులు తమ సీనియారిటీకి అనుగుణంగా కూర్చుంటారు.
వారి ఎదురుగా ప్రతిపక్ష నేతతో పాటు ఇతర శాసనసభాపక్ష నేతలకు స్థానాలు ఉంటాయి.
ఈ విధానం తమిళనాడు అసెంబ్లీలో చాలా కాలంగా కొనసాగుతున్న సంప్రదాయంగా ఉంది.
అయితే నిన్న మధ్యాహ్నం జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఎం విజయ్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
తనకు కేటాయించిన ప్రత్యేక కుర్చీ నుంచి లేచి సభా నాయకుడైన మంత్రి కేఏ సెంగొట్టయాన్, మరో మంత్రి ఆదవ్ అర్జున మధ్య ఉన్న సీటులో కూర్చున్నారు.
సాధారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కొద్దిసేపు తమ సహచరులతో మాట్లాడేందుకు స్థానాలు మారడం సహజమే.
వివరాలు
కీలక చర్చల సమయంలో అధికారులు సభలో ఉండాలన్న డిమాండ్
'కానీ ముఖ్యమంత్రి తన అధికారిక సీటును వదిలి మంత్రుల వరుసలో కూర్చోవడం మాత్రం ఇదే తొలిసారి అని సభా వర్గాలు చెబుతున్నాయి.
గతంలో ఏ ముఖ్యమంత్రీ ఇలా చేయలేదని పేర్కొంటున్నాయి.
ఇదిలా ఉండగా..సమావేశాల్లో మరో ఆసక్తికరపరిణామం చోటుచేసుకుంది.
ముఖ్యమైన అంశాలపై శాసనసభలో చర్చ జరిగే సమయంలో సంబంధిత శాఖల కార్యదర్శులు తప్పనిసరిగా సభలోనే ఉండేలా చూడాలని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ స్పీకర్‌ను కోరారు.
గత డీఎంకే ప్రభుత్వ సమయంలో కరూర్ ఘటనపై చర్చ జరిగిన సందర్భాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
అప్పట్లో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో పాటు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి,ఇతర ఉన్నతాధికారులు సభలోనే ఉన్నారని తెలిపారు.
అయితే ప్రస్తుత సమావేశాల్లో సీఎం,సంబంధిత కార్యదర్శులు సభలో కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
వార్ రూమ్‌లో ప్రసంగాలను అధికారులు నమోదు చేస్తున్నారన్న మంత్రి
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలకు మంత్రి ఆదవ్ అర్జున సమాధానమిచ్చారు.
సంబంధిత శాఖల కార్యదర్శులు అసెంబ్లీకి సమీపంలోని 'వార్ రూమ్' నుంచి సభ్యుల ప్రసంగాలను గమనిస్తూ, ముఖ్యమైన అంశాలను నమోదు చేసుకుంటున్నారని వివరించారు.
అయితే ఈ వివరణపై ఉదయనిధి వాదనకే స్పీకర్ జేసీడీ ప్రభాకర్ మద్దతు తెలిపారు.
ఇకపై కీలకమైన అంశాలపై చర్చ జరిగే సమయంలో సీనియర్ అధికారులు సభలోనే ఉండేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కాగా, సీఎం విజయ్ ఉదయం కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం అసెంబ్లీ సమావేశాలకు హాజరైనట్లు సమాచారం.