LOADING...
#NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది?
పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది?

#NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 05, 2025
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని పెద్దధన్వాడ గ్రామంలో ప్రజలు మరోసారి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్థానికంగా వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఈ పరిశ్రమ కార్యకలాపాలు మళ్లీ మొదలయ్యే సంకేతాలతో గ్రామస్తులు ఒక్కసారిగా బహిరంగంగా విరుచుకుపడ్డారు. ఈ విషయం పది గ్రామాల ప్రజలలో అసంతృప్తిని రేపుతూ మరోసారి చర్చనీయాంశమైంది.

వివరాలు 

ఫ్యాక్టరీ పూర్తిగా తరిమివేసే వరకూ వెనక్కి తగ్గం 

రాజోలి మండలానికి చెందిన పది గ్రామాల ప్రజలు పెద్దధన్వాడ వద్ద ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. గత ఏడాది నుంచి నిరంతరాయంగా కొనసాగిస్తున్న ఆందోళనలు మళ్లీ ఉద్ధృతంగా మారాయి. ఇన్ని రోజులు ఎలాంటి హడావుడి లేకపోయినా ప్రజలు మాత్రం ఆందోళన బాట వీడలేదు. ఫ్యాక్టరీ పూర్తిగా తరిమివేసే వరకూ వెనక్కి తగ్గమని తేల్చి చెప్పారు. అయితే, బుధవారం ఆ పరిశ్రమకు చెందిన కొంతమంది సిబ్బంది ప్రాంతానికి రాగానే పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. గ్రామస్తులు వారి ఆధీనంలోని సామగ్రిని ధ్వంసం చేశారు. గాయత్రి కంపెనీ పేరుతో పెద్దధన్వాడ గ్రామ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

వివరాలు 

జనవరిలో గ్రామస్తులు రిలే దీక్షలు

ఈ కంపెనీ గత అక్టోబర్‌లో ప్రభుత్వ అనుమతితో పనులు ప్రారంభించే యత్నం చేసింది. అప్పుడే స్థానికులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తమ ఆరోగ్యాన్ని, జీవనాన్ని ప్రమాదంలోకి నెట్టే ఈ పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టంగా ప్రకటించారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేసి పరిశ్రమను తరలించాలని విజ్ఞప్తి చేశారు. వినతులు, ధర్నాలు జరిగినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో జనవరిలో గ్రామస్తులు రిలే దీక్షలు చేపట్టారు. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకులు వచ్చి ప్రజలతో చర్చలు జరిపారు. జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో సమావేశాలు జరిగాయి. ప్రజల నిరసన తీవ్రతను గమనించిన అధికారులు తాత్కాలికంగా పనులు ఆపుతున్నట్లు ప్రకటించారు.

వివరాలు 

కంపెనీ సిబ్బందిని అడ్డుకున్న ఆందోళనకారులు 

అయితే ప్రజలు మాత్రం పరిశ్రమను అక్కడుండనీయబోమని, పూర్తిగా తరలించాలని డిమాండ్ చేశారు. దీనిపై అధికారులూ, ప్రజాప్రతినిధులూ ప్రభుత్వంతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. అయితే, అప్పటికి ఫ్యాక్టరీ తరలింపు విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తాజాగా బుధవారం పరిశ్రమకు చెందిన వ్యక్తులు మళ్లీ పనులు ప్రారంభించేందుకు రంగంలోకి దిగారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే పెద్దధన్వాడ ప్రజలు రోడ్డెక్కారు. రోడ్డుపై ధర్నా చేసి పనులను ఆపాలని డిమాండ్ చేశారు. కంపెనీ సిబ్బందిని అడ్డుకున్నారు. దీనివల్ల అక్కడ తాత్కాలికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులే పనులు ఆపుతామన్న తరవాత ఇప్పుడు మళ్లీ ఎలా మొదలుపెట్టారని గ్రామస్తులు ప్రశ్నించారు. పెద్దలు, యువకులు, మహిళలు సమూహాలుగా సంఘటితమై ఫ్యాక్టరీ పనులను అడ్డుకున్నారు.

వివరాలు 

. పరిశ్రమకు సంబంధించిన సామగ్రి ధ్వంసం

ఈ ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ధర్నా చేస్తున్న వారిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. కొంతమంది కిందపడిపోవడంతో గాయాలపాలయ్యారు. దీంతో ప్రజలు మరింత ఆగ్రహంతో ఉవ్వెత్తున లేచారు. పరిశ్రమకు సంబంధించిన సామగ్రిని ధ్వంసం చేశారు. గుడారాలను కూల్చేశారు. ఒక కంటైనర్‌కు నిప్పుపెట్టారు. అక్కడ ఉన్న జేసీబీ, కార్లు, టిప్పర్ వాహనాలను ధ్వంసం చేశారు. పరిశ్రమ పనుల కోసం వచ్చిన కూలీలను అక్కడి నుంచి తరిమేశారు.

వివరాలు 

బౌన్సర్లే మమల్ని కొట్టారు: ఆందోళనకారులు 

పోలీసులు ఈ ఉద్రిక్తతను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. నిరసనలో పాల్గొని విధ్వంసానికి పాల్పడ్డవారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటన తెలుసుకున్న అంలపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయుడు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఆందోళనకారులను పరామర్శించారు. అయితే, తమను కొట్టింది పోలీసులు కాదు... పరిశ్రమ తరఫున వచ్చిన బౌన్సర్లేనని ఆందోళనకారులు ఆయనకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. బౌన్సర్లతో ప్రజలపై దాడులు చేయడం ఏంటని అధికారులను నిలదీశారు. ఆందోళనకారులపై చేయిచేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.