Bihar Election: బీహార్‌లో రికార్డ్ స్థాయిలో తొలి విడత పోలింగ్.. 64.66 శాతం నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్‌లో జరిగిన తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. ఊహించని విధంగా ఈసారి ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎన్నికలు ఒక పండుగలా జరిగాయని చెప్పొచ్చు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు నమోదు కాని అత్యధిక పోలింగ్ నమోదయిందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. తొలి విడతలో మొత్తం 64.66% పోలింగ్ జరిగిందని ప్రకటించింది. 1951లో జరిగిన ఎన్నికల తర్వాత ఇంత ఎక్కువ పోలింగ్ శాతం ఇదే మొదటిసారి నమోదైందని, అంటే దాదాపు 74 ఏళ్ల తర్వాత 2025 ఎన్నికల్లో రికార్డు సృష్టించబడిందని ఈసీ స్పష్టం చేసింది.
వివరాలు
బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు
బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. వీటిలో పోలింగ్ రెండు విడతలుగా నిర్వహిస్తున్నారు. గురువారం జరిగిన తొలి దశలో 121 స్థానాలకు ఓటింగ్ పూర్తయింది. మిగతా 122 స్థానాలకు రానున్న మంగళవారం రెండో విడత పోలింగ్ జరగనుంది. ప్రధాన పోటీ ఇండియా కూటమి, ఎన్డిఏ కూటమిల మధ్య నెలకొంది. ప్రతిపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీ యాదవ్ ను ముందుకు తీసుకువస్తే, అధికార కూటమి మాత్రం తమ సీఎం అభ్యర్థి పేరు ప్రకటించకుండా ఎన్నికల రంగంలోకి దిగింది. ప్రజల్ని ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోల రూపంలో రెండు వర్గాలు విభిన్న హామీలు ఇచ్చాయి. ప్రతిపక్షం"ఇంటికో ప్రభుత్వం"అంటూ ఉద్యోగాల హామీ ఇవ్వగా,అధికార కూటమి కొటి ఉద్యోగాలు కల్పిస్తాం అంటూ ప్రకటన చేసింది.
వివరాలు
1951-52లో జరిగిన తొలి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 42.6% పోలింగ్
ఈ హామీల ప్రభావమనో, లేదా మార్పు కోసం ప్రజల్లో ఉన్న ఆకాంక్షనో, ఏ కారణం అయినా సరే - ఈసారి ఓటర్ల స్పందన అసాధారణంగా భారీగా నమోదై చరిత్ర సృష్టించింది. ఓటర్లు తండోపతండాలుగా వచ్చి ఓటేశారు. దీంతో ఏ కూటమి ఆధిక్యంలో ఉందో అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తొలి విడతలో మహిళలు రికార్డు స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వినోద్ గుంజ్వాల్ తెలిపారు. ఓటింగ్ ప్రక్రియలో వచ్చిన చెల్లాచెదురు ఇబ్బందులను తక్షణమే పరిష్కరించామని ఆయన చెప్పారు. 1951-52లో జరిగిన తొలి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 42.6% పోలింగ్ మాత్రమే నమోదైతే, 2000 ఎన్నికల్లో అది 62.57% కు పెరిగింది.
వివరాలు
మార్పు కోసం బయటకు వచ్చిన మహిళలు
2020లో పోలింగ్ 57.29% కు తగ్గిపోయింది. తాజా ఎన్నికల్లో అయితే ఈ రికార్డులన్నీ దాటుకుని ఈసారీ తొలి విడతలోనే 64.66% నమోదు కావడం విశేషం. పెరిగిన పోలింగ్ పై రాజకీయ నిపుణులు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు మార్పు కోసం బయటకు వచ్చారు అని విశ్లేషకుల అభిప్రాయం. జీవికా దీదీల ఉద్యోగాలను శాశ్వతంగా మార్చి ₹30,000 జీతం ఇస్తామని తేజస్వి యాదవ్ చేసిన ప్రకటన, అలాగే ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం హామీ ప్రజల్లో ప్రభావం చూపిందని వారు చెబుతున్నారు. అయితే ఈ భారీ పోలింగ్ శాతం ఏ కూటమికి లాభం చేకూర్చుతుందో తెలుసుకోవాలంటే నవంబర్ 14 న ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే.