
Hyderabad: కోకాపేట భూములకు రికార్డు ధర.. బుద్వేల్ భూముల వేలానికి నోటిఫికేషన్
ఈ వార్తాకథనం ఏంటి
కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో ధర పలకడంతో హైదరాబాద్ శివారులోని బుద్వేల్ భూములను కూడా వేలం వేయడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది.
బుద్వేల్‌లోని వంద ఎకరాల భూముల అమ్మకానికి సంబంధించి హెచ్ఎండీఏ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీంతో ఈనెల 6వ తేదీన ప్రి బిడ్ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
ఒకవేళ ఆన్‌లైన్‌లో వేలంలో పాల్గొనేందుకు ఆసక్తిగలవారు ఈనెల 8వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
ఈ ప్లాట్ల కనీస ధరను ప్రభుత్వం రూ. 20 కోట్లుగా నిర్ణయించడం విశేషం. 100 ఎకరాల స్థలాన్ని 3.47 ఎకరాల నుంచి 14.33 ఎకరాల విస్తీర్ణంతో మొత్తంగా 14 ప్లాట్లుగా విభజించారు.
Details
బుద్వేల్ ఉన్న లేఅవుట్ కు అధిక డిమాండ్
ఒకవైపు ఔటర్ రింగ్ రోడ్డు, మరోవైపు హిమాయత్ సాగర్ జలాశయం సమీపంలో ఈ లేఅవుట్ ఉండటంతో ఈ ప్లాట్లకు మంచి డిమాండ్ ఏర్పడింది.
ఇప్పటికే ఈ లేఅవుట్‌లో భారీ విస్తీర్ణంతో కూడిన రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు.
ఈ లేఅవుట్‌లో భారీ ఎత్తున భవనాలు నిర్మించవచ్చు. ఈ ప్రాంతంలో ప్రభుత్వం ఎయిర్ పోర్టు మెట్రో ఎక్స్ ప్రెస్ మార్గాన్ని నిర్మిస్తోంది.
ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వెళ్లే మార్గంలో ఉన్న బుద్వేల్ ప్రాంతానికి అధిక డిమాండ్ ఉందని అధికారులు వెల్లడించారు.
మరిన్ని వివరాలకు https://www.hmda.gov.in/auctions/ సంప్రదించగలరు.