Red Fort blast: ఉగ్రవాదులకు చెందిన మరో కారు గుర్తింపు.. ఈ కారులోనే పేలుడు పదార్థాలు రవాణా
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ బాంబు పేలుడుకు సంబంధించిన దర్యాప్తు వేగంగా సాగుతోంది. అధికారులు లోతుగా పరిశీలించడంతో కొత్త కొత్త కుట్ర సంకేతాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే కొన్ని ముఖ్యమైన ఆధారాలు లభించిన నేపథ్యంలో, తాజాగా ఉగ్రవాదులు వినియోగించిన మరో వాహనం కూడా గుర్తించారు. ఇది మొత్తం కుట్రలో భాగంగా అద్దెకు తీసుకున్న ఐదో కారు అని విచారణలో తేలింది. ఆ వాహనం హ్యుందాయ్ i10 మోడల్. అక్టోబర్ 24 నుంచి 27 వరకు ఈ కారును అద్దెకు తీసుకున్నట్లు రికార్డుల్లో కనిపించింది. నవంబర్ 10న ఢిల్లీలో జరిగిన పేలుడుకు ముందు, ఎన్నో రోజుల పాటు ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో ఈ వాహనం ద్వారా గోప్యంగా పేలుడు పదార్థాలు తరలించారని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
వివరాలు
డాక్టర్ ముజమ్మిల్ ఇంట్లో పెద్ద మొత్తంలో అమోనియం నైట్రేట్
ఈ i10 ఒక టాక్సీ యజమానికి చెందినది. మూడు రోజుల అద్దెకు ₹4,000 తీసుకున్నట్లు అతడు వెల్లడించాడు. డ్రైవర్‌ను వెంట పెట్టుకోకుండా తీసుకెళ్లాలని చెప్పడంతో కొంత అనుమానం కలిగినా,చివరకు వాహనాన్ని ఇచ్చేశామని యజమాని తెలిపాడు. డాక్టర్ ముజమ్మిల్ ఇంట్లో పెద్ద మొత్తంలో అమోనియం నైట్రేట్‌తో పాటు మరో అనేక రసాయనాల నిల్వలు ఉన్నట్లు దాడుల్లో బయటపడ్డాయి. ఈ పదార్థాల రవాణా కోసం ఇదే కారు ఉపయోగించారని అంచనా. అలాగే డాక్టర్ ఉమర్ కూడా పేలుడు పదార్థాలు తరలించడానికి ఈ అద్దె వాహనాన్ని ఉపయోగించినట్లు స్పెషల్ సెల్ దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం ఆ i10 కారును ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు.టాక్సీ యజమాని,డ్రైవర్‌కు ఉమర్ ఫొటో చూపించగానే అతడే కారు తీసుకెళ్లినవ్యక్తి అని ఇద్దరూ గుర్తించారు.
వివరాలు
ఉమర్, ముజమ్మిల్ తరచూ అద్దె కార్లనే వాడారు
అయితే వాహనంలో జీపీఎస్ లేకపోవడంతో ఖచ్చితమైన మార్గాన్ని గుర్తించడం కష్టంగా మారింది. మరోవైపు, అధికారులు ఎరువుల షాపులు, రసాయనాల దుకాణాల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను సేకరిస్తూ మరిన్ని ఆధారాలు అన్వేషిస్తున్నారు. డాక్టర్లు ఉమర్, ముజమ్మిల్ తరచూ అద్దె కార్లనే వాడినట్లు దర్యాప్తులో బయటపడుతోంది. అనుమానం రాకుండా ఉండేందుకు వారు ఇదే పద్ధతిని అనుసరించారని ఒక ఉన్నతాధికారి తెలిపారు. ఇదిలా ఉంటే, మంగళవారం డాక్టర్లు షాహీద్, ముజమ్మిల్ మారుతి బ్రెజ్జా కారును కొనుగోలు చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సెప్టెంబర్ 25న షాహీద్ పేరిట ఆ కారు కొనుగోలు చేసినట్లు తేలింది. ఆ ఫొటో నిజమైనదేనని అధికారులు ధృవీకరించారు.