
Rains: వరుస వర్షాలతో అన్నదాతలకు ఊరట
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలో వరుస వర్షాలతో సాగు కార్యకలాపాలు ఆశాజనకంగా మారాయి. వానాకాలం ప్రారంభమైన జూన్ నెల నుంచి 25 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో తీవ్ర ఆందోళనకు గురైన రైతులకు,ఇటీవలి వర్షాలు ఎంతో ఊరటను కలిగిస్తున్నాయి. పంటలకు తగినంత నీరు అందడంతో పాటు వరినాట్లు,విత్తనాల చల్లి పనులు వేగంగా కొనసాగడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. ఈ నెల 16వ తేదీ వరకు రాష్ట్రం మొత్తంగా సాధారణ వర్షపాతం కంటే 28శాతం తక్కువగా వర్షాలు నమోదవడంతో, 25 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు కనిపించాయి. ఒక దశలో వరి నాట్లకు కూడా నీరు అందని పరిస్థితి ఏర్పడగా,ఇతర పంటలకు విత్తనాలు వేయడానికి వెనకాడారు. ఈ పరిస్థితుల్లో వరుసగా పడుతున్న వర్షాలు రైతాంగానికి ఆశాజనకమైన వాతావరణాన్ని కల్పించాయి.
వివరాలు
సాగు విస్తీర్ణంలో పెరుగుదల
రాష్ట్రంలో మొత్తం 1.32 కోట్ల ఎకరాలపరంగా ఖరీఫ్ పంటల సాగుకు లక్ష్యం ఉండగా, ఈ నెల 16వ తేదీ నాటికి కేవలం 61,10,170 ఎకరాల్లోనే పంటలు వేశారు. తాజా వర్షాలతో సాగు విస్తీర్ణం వేగంగా పెరిగి 76.28 లక్షల ఎకరాలకు చేరుకుంది. వరి పంట సాధారణంగా 62,47,868 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉంటుంది. అయితే గత వారం వరకు కేవలం 7,78,284 ఎకరాల్లో మాత్రమే వరి సాగు జరిగింది. ఇప్పుడు ఆ సంఖ్య 17,52,144 ఎకరాలకు పెరిగింది. ఇంతగా వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఖరీఫ్ పంటల సాగుకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.