LOADING...
Madaram: మేడారం భక్తులకు ఊరట.. 25 నుంచి ప్రత్యేక బస్సుల ఏర్పాటు
మేడారం భక్తులకు ఊరట.. 25 నుంచి ప్రత్యేక బస్సుల ఏర్పాటు

Madaram: మేడారం భక్తులకు ఊరట.. 25 నుంచి ప్రత్యేక బస్సుల ఏర్పాటు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 24, 2026
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం జాతర జరగనుంది. జాతరకు వచ్చే భక్తులను చేరవేయడంలో ఆర్టీసీ కీలక పాత్ర పోషించనుంది. ఈ క్రమంలో నగరంలో మూడు ప్రాంతాల్లో తాత్కాలిక ప్రయాణ ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంతో పాటు వరంగల్‌, కాజీపేటలో ఈ ప్రాంగణాలు అందుబాటులోకి రానున్నాయి. నగరం చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడి నుంచే మేడారానికి ప్రయాణించాల్సి ఉంటుంది.

Details

ప్రత్యేక వసతుల ఏర్పాటు

తాత్కాలిక ప్రయాణ ప్రాంగణాల్లో భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నారు. బస్సులు ఎక్కేందుకు ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్ల ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటున్నారు. హనుమకొండ హయగ్రీవాచారి మైదానం నుంచి 400 బస్సులను నడపనున్నారు. ఇవి నిత్యం మేడారం-హనుమకొండ మధ్య తిరుగుతుంటాయి. టికెట్‌ ఛార్జీలు పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.150గా నిర్ణయించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. అలాగే ఉచిత వైద్య శిబిరం, తాత్కాలిక క్యాంటీన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

Details

ఉచిత శుద్ధజల పంపిణీకి కూడా చర్యలు

నాలుగు టికెట్‌ బుకింగ్‌ కేంద్రాల ఏర్పాటుతో పాటు ఉచిత శుద్ధజల పంపిణీకి కూడా చర్యలు చేపట్టారు. మొత్తం ప్రాంగణం సీసీ కెమెరాల పర్యవేక్షణలో కొనసాగనుంది. హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూంకు తాత్కాలిక బస్‌స్టేషన్‌ను అనుసంధానం చేస్తుండగా, అక్కడి నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేపడతారు. భద్రతా బందోబస్తు కోసం పోలీసులు ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి నుంచే మేడారానికి ప్రత్యేక బస్సులు బయలుదేరనున్నాయి. అయితే ఈ ప్రత్యేక బస్సుల్లో ఆన్‌లైన్‌, యూపీఐ చెల్లింపుల సదుపాయం లేదని, నగదు చెల్లించి టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుందని వరంగల్‌ డిపో-1 మేనేజర్‌ అర్పిత స్పష్టం చేశారు.

Advertisement