LOADING...
Stray Dogs case: వీధి కుక్కల కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు 
వీధి కుక్కల కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Stray Dogs case: వీధి కుక్కల కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 07, 2025
03:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు శుక్రవారం ముఖ్యమైన ఆదేశాలు ఇచ్చింది. పాఠశాలలు, కళాశాలలు వంటి విద్యాసంస్థలు, బస్‌ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, క్రీడా ప్రాంగణాలు, ఇతర జనసంచారం అధికంగా ఉండే బహిరంగ ప్రాంతాల పరిసరాల నుంచి వీధి కుక్కలను ప్రత్యేక ఆశ్రయ కేంద్రాలకు తరలించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే ఈ ప్రదేశాల్లోకి అవి ప్రవేశించకుండా తగిన రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ ప్రాంతాల్లో కుక్కలు లేవని నిర్ధారించుకునేందుకు సంబంధిత అధికారులు నిరంతరం పరిశీలనలు చేయాలని కూడా కోర్టు తెలిపింది. ఏ కారణం చేతనైనా మళ్లీ వాటిని పట్టుకొన్నచోటే వదిలివేయొద్దని ఆదేశించింది.

వివరాలు 

తదుపరి విచారణను జనవరి 13కి వాయిదా

కోర్టు ఈ కుక్కల తరలింపుకు 8 వారాల గడువు విధించింది. అదనంగా, జాతీయ రహదారులపై తిరుగుతున్న యజమానిలేని పశువులను కూడా షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, జాతీయ రహదారి శాఖ, స్థానిక సంస్థలు,హైవే పహారా బృందాలకు సూచనలు పంపాలని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 13కి వాయిదా వేసింది.

వివరాలు 

అసలు ఏం జరిగిందంటే..? 

దిల్లీ,ఎన్సీఆర్‌ ప్రాంతాల్లో వీధి కుక్కల దాడుల కారణంగా రేబిస్‌ మృతుల సంఖ్య పెరుగుతోందన్న వార్తలను పరిగణనలోకి తీసుకుని, జస్టిస్‌ పార్దీవాలా, జస్టిస్‌ ఆర్‌. మహదేవన్‌ నేతృత్వంలోని ధర్మాసనం గత ఆగస్టు 11న 8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. అయితే ఆ ఆదేశంపై దేశ వ్యాప్తంగా ఎన్నో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతా, జస్టిస్‌ ఎన్‌.వి. అంజరియాలతో కూడిన మరో త్రిసభ్య ధర్మాసనం ఆ తీర్పును పునర్విమర్శించింది. అప్పట్లో రేబిస్‌ లక్షణాలు కనిపించే కుక్కలు, తీవ్రంగా ప్రవర్తించే కుక్కలు మినహా ఇప్పటికే షెల్టర్లలో ఉంచిన కుక్కలను తిరిగి వాటిని పట్టిన ప్రాంతాలకే వదిలివేయాలని ఆదేశించింది.

వివరాలు 

అసలు ఏం జరిగిందంటే..? 

వీధి కుక్కలకు వ్యాక్సినేషన్‌, స్టెరిలైజేషన్‌ పూర్తయ్యాక వాటిని మళ్లీ అదే ప్రాంతాల్లో విడిచిపెట్టే విధానం కొనసాగించాలని సూచిస్తూ ఆగస్టు 11 తీర్పును సవరించింది. అయితే ఇప్పుడు కొత్త ఆదేశాల్లో మళ్లీ వాటిని మూలస్థానాలకు విడిచిపెట్టకూడదని స్పష్టంగా చెప్పడమే గమనార్హం. అదే సమయంలో వీధి కుక్కలకు ఆహారం అందించేందుకు ప్రత్యేక ఫీడింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని స్థానిక సంస్థలను సుప్రీంకోర్టు ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో యాదృచ్ఛికంగా ఆహారం పెట్టడం అనుమతించబడదని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.