DGCA: జీపీఎస్ స్పూఫింగ్ సమస్యలపై 10 నిమిషాల డెడ్‌లైన్ పెట్టిన డీజీసీఏ
ఈ వార్తాకథనం ఏంటి
విమానయాన రంగంలో ఇటీవలి కాలంలో జీపీఎస్ స్పూఫింగ్ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, సివిల్ ఏవియేషన్ ప్రధాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అప్రమత్తం అయింది. జీపీఎస్ వ్యవస్థలో ఏదైనా అసాధారణ లోపం లేదా అంతరాయం గుర్తించిన వెంటనే, పది నిమిషాల లోపలే సంబంధిత విభాగానికి సమాచారం ఇవ్వాలి అని విమానయాన సంస్థలు, పైలట్లు, అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు (ఏటీసీ) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
వివరాలు
ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో వందలాది విమానాల ఆలస్యం
ఇటీవల ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (ఐజీఐఏ) జరిగిన ఘటన ఈ చర్యలకు కారణమైంది. జీపీఎస్ స్పూఫింగ్ వల్ల వరుసగా రెండు రోజులపాటు వందలాది విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో, డీజీసీఏ ఈ సమస్యను తక్షణమే గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించింది. అదేవిధంగా, రియల్ టైమ్ మానిటరింగ్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. డీజీసీఏ తాజా ప్రకటన ప్రకారం, పైలట్లు, ఏటీసీ సిబ్బంది లేదా సాంకేతిక అధికారులు తమ విధుల్లో ఉండగా జీపీఎస్ పనితీరులో ఏదైనా తేడా గమనిస్తే వెంటనే నివేదించాలి.
వివరాలు
2023 నవంబర్ నుండి 2025 ఫిబ్రవరి సుమారు 465 జీపీఎస్ స్పూఫింగ్ ఘటనలు
నివేదికలో ఘటన జరిగిన తేదీ, సమయం, విమాన నంబర్, మార్గం వంటి వివరాలు సమగ్రంగా ఉండాలని సూచించింది. అలాగే, జీపీఎస్ జామింగ్, స్పూఫింగ్, సిగ్నల్ లాస్ లేదా ఇంటిగ్రిటీ ఎర్రర్ వంటి లోపాల్లో ఏది సంభవించిందో స్పష్టంగా పేర్కొనాలని ఆదేశించింది. అధికారుల అంచనా ప్రకారం, 2023 నవంబర్ నుండి 2025 ఫిబ్రవరి వరకు దేశవ్యాప్తంగా సుమారు 465 జీపీఎస్ స్పూఫింగ్ ఘటనలు నమోదు అయ్యాయి. ముఖ్యంగా అమృత్‌సర్, జమ్మూ వంటి సరిహద్దు ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ చర్యల ద్వారా జీపీఎస్ స్పూఫింగ్‌ను త్వరగా గుర్తించడం, విమాన భద్రతను బలోపేతం చేయడం, సమయపాలనను మెరుగుపరచడం డీజీసీఏ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.