Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్ర దినోత్స వేడుకలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశమంతటా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సాయుధ దళాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ బలగాలు, ఎన్‌సీసీ కేడెట్లు నిర్వహించిన మార్చ్‌పాస్ట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, డీజీపీ శివధర్‌రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అమరవీరుల స్మారకం వద్ద ప్రముఖులు నివాళులర్పించారు.
వివరాలు
అమరావతిలో తొలిసారిగా రిపబ్లిక్ డే..
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు లోకేశ్, అచ్చెన్నాయుడు, నారాయణ, కొల్లు రవీంద్ర తదితరులు హాజరయ్యారు. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన మైదానంలో వేడుకలు నిర్వహించారు. పరేడ్‌లో పాల్గొన్న 11 విభాగాల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా 22 శకటాలను ప్రదర్శించారు. ఈ చారిత్రక వేడుకలను వీక్షించేందుకు రాజధాని పరిధిలోని రైతులు, విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.