ఎన్‌సీపీని ఐక్యంగా ఉంచాలని శరద్ పవార్‌ను కోరాం: అజిత్ పవార్ బృందం
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) రెండుగా చీలిన తర్వాత అజిత్ పవార్, సునీల్ తట్కరే, ప్రఫుల్ పటేల్ సోమవారం ముంబైలో శరద్ పవార్‌తో సమావేశమయ్యారు. గత 24 గంటల్లో అజిత్ పవార్ వర్గం శరద్ పవార్‌తో చర్చలు జరపడం ఇది రెండోసారి కావడం గమనార్హం. సమావేశం అనంతరం ప్రఫుల్ పటేల్ మీడియాతో మాట్లాడారు. ఎన్‌సీపీని ఐక్యంగా ఉంచాలని తాము శరద్ పవార్‌ను అభ్యర్థించామన్నారు. శరద్ పవార్ తమ మాట విన్నారు కానీ, ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. అయితే ఆదివారం అజిత్ పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా వైబీ చవాన్ సెంటర్‌లో తన మామ శరద్ పవార్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
రేపు జరిగే ఎన్డీయే సమావేశానికి ఎన్సీపీ తరఫున ప్రఫుల్, అజిత్ హాజరు
దిల్లీలో రేపు జరగనున్న ఎన్డీయే సమావేశానికి ఎన్సీపీ తరఫున ప్రఫుల్ పటేల్, అజిత్ పవార్ హాజరుకానున్నారు. 82ఏళ్ల ఎన్‌సీపీ అధినేత 2024 లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీకి వ్యతిరేకంగా వివిధ పార్టీలను ఏకం చేసే ప్రయత్నంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే అజిత్ పవార్ ప్రతిపక్ష శ్రేణులను విడిచిపెట్టి, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. దీంతో ఎన్సీపీ రెండుగా చీలిపోయింది. శరద్ పవార్ మాత్రం తాను తన ప్రగతిశీల రాజకీయాలను కొనసాగిస్తానని, బిజెపితో ఎప్పటికీ పొత్తు పెట్టుకోనని గతంలోనే స్పష్టం చేశారు.