Uttarakhand rescue: 14రోజులుగా సొరంగంలోనే కార్మికులు.. డ్రిల్లింగ్ యంత్రానికి మరోసారి అడ్డంకి
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో కూలిపోయిన సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సహాయక చర్యలకు మళ్లీ అడ్డంకి ఏర్పడింది. సొరంగంలో కార్మికులు చిక్కుకుపోయి 14 రోజులైంది. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు డ్రిల్లింగ్ చేస్తున్న అమెరికా హెవీ ఆగర్ యంత్రానికి మరోసారి అడ్డంకి ఎదురైంది. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు యంత్రంతో డ్రిల్లింగ్ ప్రారంభించారు. కానీ ఒక మీటరు వెళ్లేసరికి ఆగర్ డ్రిల్లింగ్ మిషన్ రీబార్, ఇనుప పైపులు అడ్డం వచ్చాయి. దీంతో రెస్క్యూ టీమ్ డ్రిల్లింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో ఏ క్షణంలోనే కార్మికులు బయటకు వస్తారని అనుకున్న కుటుంబ సభ్యుల ఆశలు అడియాశలయ్యాయి.
మరో 10 మీటర్ల డ్రిల్లింగ్ చేస్తే ఆపరేషన్ పూర్తి
కార్మికుల బయటకు తీసుకురావడానికి ఆపరేషన్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఇప్పటి వరకు 47 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేశామని ఎన్‌హెచ్‌ఐడీసీఎల్ జనరల్ మేనేజర్ కల్నల్ దీపక్ పాటిల్ వెల్లడించారు. ఇంకో 10 మీటర్ల డ్రిల్లింగ్ చేస్తే.. ఆపరేషన్ పూర్తి అవుతుందని, కార్మికులు బయటకు వస్తారని ఆయన చెప్పారు. అయితే డ్రిల్లింగ్ యంత్రానికి ఇనుప పైపులు పదేపదే తాకుతున్నాయని, దీంతో ఆపరేషన్‌ను నిలిపివేయాల్సి వచ్చినట్లు వెల్లడించారు. నవంబర్ 12 నుంచి ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. దేశంలోనే కాకుండా ప్రపంచంలోని ప్రధాన విపత్తు నిర్వహణ నిపుణులందరూ ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.