AP High Court: ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు తప్పనిసరి: ఏపీ హైకోర్టు కీలక తీర్పు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఆరు నెలల్లోపే రిజర్వేషన్ విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎన్. విజయ్ చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ప్రస్తుత మెగా డీఎస్సీ-2025లో స్కూల్ అసిస్టెంట్ (హిందీ) పోస్టుకు దరఖాస్తు చేసిన పిటిషనర్ అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకి చెందిన ట్రాన్స్‌జెండర్ కె. రేఖ మెగా డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ (హిందీ) పోస్టుకు దరఖాస్తు చేసి, జిల్లాలో 671వ ర్యాంకు సాధించారు.
Details
హైకోర్టులో పిటిషన్
అయితే ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక పోస్టుల కేటాయింపు లేకపోవడంతో అధికారులు ఆమె దరఖాస్తును పరిగణనలోకి తీసుకోలేదు. దీనిపై ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో, పిటిషనర్ తరఫు న్యాయవాది ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు ఇవ్వకపోవడం, ఉద్యోగ అవకాశాలపై వివక్ష చూపడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని వాదించారు. దీనికి ప్రతిగా, ప్రభుత్వ న్యాయవాది— రిజర్వేషన్లు ఇవ్వడం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం కాబట్టి, ప్రత్యేక రిజర్వేషన్ లేకుండా నియామక ప్రక్రియను తప్పుపట్టలేమని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.
Details
పిటిషనర్ అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలి
దేశంలో అత్యంత వెనుకబడిన వర్గాల్లో ట్రాన్స్‌జెండర్లు ఒకరని, వారిని రక్షించేందుకు కేంద్రం 2019లో చట్టం తీసుకొచ్చినా రాష్ట్రాలు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని పేర్కొన్నారు. వారి అభ్యున్నతికి చర్యలు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని తీర్పులో స్పష్టం చేశారు. అందువల్ల పిటిషనర్ రేఖ అభ్యర్థిత్వాన్ని వెంటనే పరిగణనలోకి తీసుకోవాలి. ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్ విధానాన్ని ఆరు నెలల్లోగా ఖరారు చేయాలని ప్రభుత్వం మీద హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.