Loading...
Yellampalli Reservoir: ఆశలు రేపుతున్న జలాశయాలు.. పెరుగుతున్న వరద ప్రవాహాలు
ఆశలు రేపుతున్న జలాశయాలు.. పెరుగుతున్న వరద ప్రవాహాలు

Yellampalli Reservoir: ఆశలు రేపుతున్న జలాశయాలు.. పెరుగుతున్న వరద ప్రవాహాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 01, 2026
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రధాన రిజర్వాయర్లలోకి వరద ప్రవాహాలు పెరుగుతుండటంతో నీటినిల్వలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. ముఖ్యంగా గోదావరి ప్రధాన ప్రవాహంతో పాటు ప్రాణహిత, ఇంద్రావతి ఉపనదుల నుంచి భారీగా నీరు చేరుతుండటంతో భద్రాచలం వద్ద వరద తీవ్రత పెరిగింది. భద్రాచలం వద్ద ప్రస్తుతం 11.44 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదవగా, గోదావరి నీటిమట్టం 48 మీటర్లను దాటింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇంకా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వివరాలు

60 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది

శ్రీరామసాగర్‌ (ఎస్సారెస్పీ) జలాశయంలోకి శుక్రవారం సాయంత్రం 60 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.

మొత్తం 80.5 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 23 టీఎంసీల నీరు ఉంది. పూర్తిస్థాయిలో నిండేందుకు మరో 57.5 టీఎంసీల నీరు అవసరం.

ప్రస్తుతం కొనసాగుతున్న వరద కనీసం మరో పది రోజుల పాటు కొనసాగినా లేదా ప్రవాహం మరింత పెరిగినా మాత్రమే ఎస్సారెస్పీ పూర్తిగా నిండే అవకాశం ఉంది.

ఎస్సారెస్పీ దిగువన ఉన్న కడెం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం 11,700 క్యూసెక్కులకు తగ్గింది.

ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 88,705 క్యూసెక్కుల నీరు వస్తుండగా, అక్కడి నుంచి 96 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.

వివరాలు

మధ్యమానేరు ప్రాజెక్టులో 10 టీఎంసీల నీరు నిల్వ

ఎల్లంపల్లి నుంచి నంది, గాయత్రి పంపుహౌస్‌ల ద్వారా మధ్యమానేరు జలాశయానికి నీటిని ఎత్తిపోస్తున్నారు.

ప్రస్తుతం మధ్యమానేరు ప్రాజెక్టులో 10 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాణహిత నుంచి భారీ వరద కొనసాగుతుండటంతో మేడిగడ్డ బ్యారేజి వద్ద గోదావరిలో 10.62 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతోంది.

వచ్చిన మొత్తం నీటినీ దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువన ఇంద్రావతి నది ప్రవాహం కలవడంతో సమ్మక్క బ్యారేజి వద్ద వరద 14.6 లక్షల క్యూసెక్కులకు చేరింది. అక్కడ కూడా వచ్చిన నీటినంతా దిగువకు వదులుతున్నారు.

గోదావరి బేసిన్‌లో కడెం, ఎల్లంపల్లి మినహా మిగిలిన ప్రధాన ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు గణనీయంగా పెరగాలంటే ప్రస్తుతం వస్తున్న వరదలు మరికొన్ని రోజులు కొనసాగాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు.

ADVERTISEMENT

వివరాలు

కృష్ణా పరీవాహకంలో కొంత ఊరట

మరోవైపు మంజీర నదిపై ఉన్న నిజాంసాగర్‌లోకి 4,530 క్యూసెక్కులు, సింగూరు జలాశయంలోకి 700 క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే నమోదవుతోంది.

కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది.

ఎగువన ఆలమట్టి జలాశయంలోకి 83 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, అక్కడి నుంచి 1.10 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.

నారాయణపూర్‌ నుంచి 1.05 లక్షల క్యూసెక్కులు విడుదల కావడంతో పాటు దిగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టులోకి 1.22 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది.

అక్కడి నుంచి 1.36 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో శ్రీశైలం జలాశయంలోకి ప్రస్తుతం 1.31 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.

ADVERTISEMENT

వివరాలు

240 టీఎంసీల వరద ప్రవాహం ఇంకా అవసరం

శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటిమట్టానికి చేరుకున్నప్పటికీ పూర్తిగా నిండేందుకు ఇంకా 160 టీఎంసీల నీరు అవసరం.

అలాగే నాగార్జునసాగర్‌ జలాశయం నిండాలంటే మరో 80 టీఎంసీల నీరు కావాలి.

మొత్తం మీద శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండిపోయి ఆయకట్టుకు అవసరమైన నీటిని అందించాలంటే సుమారు 240 టీఎంసీల వరద ప్రవాహం ఇంకా అవసరమని నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ADVERTISEMENT