Loading...
Supreme Court: దిల్లీలో ఇంటర్నెట్‌, మెట్రో సేవలు పునరుద్ధరించండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
దిల్లీలో ఇంటర్నెట్‌, మెట్రో సేవలు పునరుద్ధరించండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

Supreme Court: దిల్లీలో ఇంటర్నెట్‌, మెట్రో సేవలు పునరుద్ధరించండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 11, 2026
01:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాను డిమాండ్‌ చేస్తూ రాజధాని దిల్లీలో సీజేపీ (CJP) చేపట్టిన ఆందోళనలు, వాటిని అడ్డుకునేందుకు పోలీసులు తీసుకున్న చర్యలపై పలువురు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా దిల్లీలో నిలిపివేసిన ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించాలని, మెట్రో రైళ్లను ఎలాంటి అనవసర ఆంక్షలు లేకుండా యథావిధిగా నడపాలని ఆదేశించింది. నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన అనవసరమైన బారికేడ్లను తొలగించాలని కేంద్రం, దిల్లీ పోలీసులకు స్పష్టం చేసింది. ఈ పిటిషన్లపై జస్టిస్‌ జయమాల్య బాగ్చి, జస్టిస్‌ వి. మోహనాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దిల్లీలో నిరసనల సందర్భంగా విధించిన ఆంక్షలు, పోలీసుల చర్యలపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్లను కూడా పరిశీలించింది.

వివరాలు

ఎవరికి ఆసౌకర్యం కలగకూడదు

ఈ సందర్భంగా అన్ని పక్షాల వాదనలను పూర్తిగా వింటామని, ఎవరికీ అసౌకర్యం కలగకుండా చూస్తామని ధర్మాసనం పేర్కొంది.

జరిగిన పరిణామాలను తక్కువ చేసి చూడబోమని, ఈ వ్యవహారంలో న్యాయవాదులందరి వాదనలను వింటామని స్పష్టం చేసింది.

రవాణా, రైల్వే, మెట్రో సేవలను నిలిపివేయడంపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను కూడా విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. దిల్లీలో మొత్తం 303 మెట్రో స్టేషన్లు ఉండగా, వాటిలో కేవలం 45 స్టేషన్లను మాత్రమే మూసివేసినట్లు ధర్మాసనానికి వివరించారు.

ఒక మెట్రో స్టేషన్‌ను మూసివేసినప్పటికీ, దాని పక్కనే ఉన్న మరో స్టేషన్‌ తెరిచే ఉందని తెలిపారు.

వివరాలు

కేంద్రం, దిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. మెట్రో స్టేషన్లను తెరిచి ఉంచుతామని, ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరిస్తామని, న్యాయవాదులు తమ విధులను నిర్వర్తించకుండా అడ్డుకోబోమని కేంద్రం తరఫు న్యాయవాది చేసిన వాదనలను నమోదు చేసుకుంది.

ప్రజా భద్రతకు అవసరమైన నిబంధనలకు లోబడి నగరంలో సాధారణ రాకపోకలు కొనసాగుతాయని ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా ధర్మాసనం రికార్డు చేసింది.

దిల్లీలో సాధారణ జనజీవనం, రవాణా వ్యవస్థలు, న్యాయవాదుల విధులకు అంతరాయం కలగకుండా పలు కీలక ఆదేశాలను సుప్రీంకోర్టు జారీ చేసింది.

ఇంటర్నెట్‌ సేవల పునరుద్ధరణ

నగరంలో నిలిపివేసిన ఇంటర్నెట్‌ సేవలను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించింది.

మెట్రో రైళ్ల నిర్వహణ

ఎలాంటి అనవసర ఆంక్షలు లేకుండా మెట్రో రైలు సేవలను వెంటనే యథావిధిగా నడపాలని స్పష్టం చేసింది.

ADVERTISEMENT

వివరాలు

న్యాయవాదుల విధులకు ఆటంకం వద్దు

న్యాయవాదులు తమ వృత్తిపరమైన బాధ్యతలను నిర్వర్తించకుండా అడ్డుకోవడానికి వీల్లేదని తేల్చిచెప్పింది.

ఏ ఒక్క న్యాయవాదినీ విధులు నిర్వహించకుండా నిరోధించకూడదని పేర్కొంది.

బారికేడ్ల తొలగింపు

నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన అనవసరమైన బారికేడ్లను వెంటనే తొలగించాలని కేంద్రం, దిల్లీ పోలీసులను ఆదేశించింది.

వివరణాత్మక అఫిడవిట్‌ దాఖలు

అక్టోబర్‌ 10న దిల్లీలో ఎలాంటి ఆంక్షలు విధించారు? వాటిని విధించడానికి కారణాలేమిటి? అనే అంశాలపై వచ్చే వారం పూర్తి వివరాలతో వివరణాత్మక అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మొత్తంగా, సీజేపీ నిరసనల నేపథ్యంలో దిల్లీలో విధించిన ఆంక్షలు, మెట్రో స్టేషన్ల మూసివేత, ఇంటర్నెట్‌ నిలిపివేత, న్యాయవాదుల విధులకు ఆటంకాలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి కీలక ఆదేశాలు జారీ చేసింది.

ADVERTISEMENT