Page Loader
Revanth Reddy: పాలమూరు బిడ్డను రెండోసారి వరించిన ముఖ్యమంత్రి పదవి 
Revanth Reddy: పాలమూరు బిడ్డను రెండోసారి వరించిన ముఖ్యమంత్రి పదవి

Revanth Reddy: పాలమూరు బిడ్డను రెండోసారి వరించిన ముఖ్యమంత్రి పదవి 

వ్రాసిన వారు Stalin
Dec 06, 2023
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ సీఎంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసింది. రేవంత్ రెడ్డి గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. దీంతో ఉమ్మడి పాలమూరు నుంచి ముఖ్యమంత్రి పదవి వరించిన రెండో నేతగా రేవంత్ రెడ్డి ఘనత సాధించారు. 1952లో నాటి హైదరాబాద్‌ రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని షాద్‌నగర్‌ నియోజకవర్గం విజయం సాధించిన బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా పనిచేసారు. 2023లో అదే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొడంగల్‌ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి సీఎం పీఠాన్ని అధిష్టంచబోతున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ కాంగ్రెస్ గెలిస్తే.. తాను ముఖ్యమంత్రి అవుతానని రేవంత్ రెడ్డి పరోక్షంగా పదేపదే చెప్పారు. రాష్ట్రానికి నాయకత్వం వహించే సువర్ణావకాశం మళ్లీ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు వచ్చిందని అనేకసార్లు ప్రస్తావించారు.

రేవంత్

రేవంత్ రెడ్డి ప్రస్థానం

రేవంత్ రెడ్డి 1967 నవంబర్ 8న నాగర్ కర్నూల్‌లోని కొండారెడ్డి పల్లిలో జన్మించారు. విద్యార్థి దశలో అఖిల ఏబీవీపీలో పనిచేశారు. 1992లో కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి జైపాల్ రెడ్డి మేనకోడలు అనుముల గీతను రెడ్డి వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం మొదలైంది. 2006లో స్వతంత్ర అభ్యర్థిగా జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 2007లో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి నాటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీలో చేరారు. 2009లో రేవంత్ కొడంగల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు. 2014లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు.

రేవంత్

2017లో కాంగ్రెస్‌లో రేవంత్ హవా

2017లో రేవంత్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. 2018లో ఆయన్ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రకటించింది. ఈ క్రమంలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2019‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. రేవంత్ పనితీరుకు ఫిదా అయిన కాంగ్రెస్ అధిష్టానం 2021లో ఆయన్నుకు పీసీసీ చీఫ్‌గా నియమించింది. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు రేవంత్ తీవ్రంగా కృష్టి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని తానై నడిపించి, పార్టీని విజయ తీరాలకు చేర్చారు.