Revanth Reddy: మొంథా తుపాను.. అప్రమత్తమైన తెలంగాణ సర్కార్
ఈ వార్తాకథనం ఏంటి
మొంథా తుపాన్ ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్రంలోని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఈ తుపాను ప్రభావంతో వచ్చే నాలుగు రోజులపాటు రాష్ట్రంలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా ఈ తుపాను ప్రభావంతో నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ తుపాను ప్రభావం ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని మంత్రి సూచించారు. రైతులు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యం తడవకుండా అందుబాటులో ఉన్న టార్పాలిన్లను వినియోగించాలన్నారు.
వివరాలు
తెలంగాణ వ్యాప్తంగా 8,342 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా తగిన రవాణా సదుపాయాలు కల్పించాలని ఆయన ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా 8,342 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటివరకు 4,428 కేంద్రాలు ప్రారంభమైనట్లు తెలిపారు. మిగిలిన కేంద్రాలను కూడా త్వరలో ప్రారంభించేందుకు చర్యలు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు 22,433 మంది రైతుల నుంచి ప్రభుత్వం 1,80,452 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని వెల్లడించారు.
వివరాలు
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎక్కడైనా అవినీతి జరిగితే కఠిన చర్యలు
కొనుగోలు చేసిన ధాన్యానికి త్వరితగతిన చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అలాగే కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరా శాఖాధికారులు కొనుగోలు కేంద్రాలను తరచుగా సందర్శించి పరిస్థితులను సమీక్షించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎక్కడైనా అవినీతి జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతుల సమస్యలను పరిష్కరించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.