Nadendla Manohar: ధాన్యం అమ్మిన రోజే రైతులకు సొమ్ము జమ.. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
ఈ వార్తాకథనం ఏంటి
ధాన్యం విక్రయించిన రైతులకు అదే రోజు వారి బ్యాంకు ఖాతాల్లోనే చెల్లింపులు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, సాయంత్రం 4 గంటలు, రాత్రి 7 గంటలకు - మొత్తం నాలుగు విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బు బదిలీ చేసే విధంగా 35 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. అంటే.. రైతు ఉదయం 10 గంటలకు ధాన్యం అమ్మితే, అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకల్లా డబ్బు అతని ఖాతాలోకి వెళ్లేలా చర్యలు తీసుకున్నాం. అయితే, సెలవు రోజుల్లో పేమెంట్ గేట్‌వే పనిచేయదు కాబట్టి, అటువంటి సందర్భాల్లో వచ్చే రోజు చెల్లింపు జరుగుతుంది" అని వివరించారు.
వివరాలు
గిడ్డంగుల్లో రూ.6 కోట్ల విలువ చేసే ధాన్య నిల్వ సామగ్రి సిద్ధం
అలాగే, జనవరి 1 నుండి పట్టణ ప్రాంతాల్లోని రేషన్ దుకాణాల్లో గోధుమపిండి కిలోను ₹18 ధరకే పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. కౌలు రైతులకు సహాయం చేయడానికి 50 వేల టార్పాలిన్ షీట్లను ఉచితంగా రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేసే ప్రణాళికలు సిద్ధమయ్యాయని వెల్లడించారు. విజయవాడలోని పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో బుధవారం మాట్లాడిన ఆయన, ఈ సీజన్‌లో ఖరీఫ్ ధాన్యం 85 లక్షల టన్నులు వచ్చే అవకాశం ఉందని, అందులో 51 లక్షల టన్నుల సేకరణకు కేంద్రం నుంచి అనుమతి వచ్చినట్లు వివరించారు. గిడ్డంగుల్లో రూ.6 కోట్ల విలువ చేసే ధాన్య నిల్వ సామగ్రిని ముందుగానే సిద్ధం చేశామని చెప్పారు.
వివరాలు
92% కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
ధాన్యం కొనుగోలు సమయంలో తేమ శాతం వంటి కొలతల్లో ఎలాంటి భేదాలు రాకుండా, రైతు సేవా కేంద్రాలు, మిల్లర్ల వద్ద బ్లూటూత్ ఆధారిత ఒకే రకం ప్రమాణిత యంత్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు వాట్సాప్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకుని ధాన్యం విక్రయించుకునేందుకు అవకాశాన్ని కల్పించామని వివరించారు. ధాన్యం సేకరణ కోసం వారం వారీగా లక్ష్యాలు నిర్ణయించినట్లు చెప్పారు. ఇప్పటికే 92% కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసినట్టు, మిగిలిన వాటిని ఈ నెలాఖరులోపు పూర్తిచేస్తామని తెలిపారు.
వివరాలు
అసత్య ప్రచారం నమ్మొద్దు
"పెట్టుబడి రాయితీ తీసుకున్న రైతుల పంటను కొనుగోలు చేయరంటూ కొంతమంది తప్పుదోవ పట్టించే ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి మోసపూరిత ప్రచారం గతంలో కూడా జరిగింది. మళ్లీ రైతులలో అపోహలు కలిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైతులు ఇవి నమ్మవద్దు" అని మంత్రి మనోహర్ హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు ఈ-పంట నమోదుల ఆధారంగానే జరుగుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో పౌరసరఫరాల సంస్థ ఎండీ ఢిల్లీరావు, డైరెక్టర్ గోవిందరావు పాల్గొన్నారు.