LOADING...
Yadagiri Gutta: యాదగిరిగుట్ట కొండపైకి రోప్‌వే.. పర్వతమాల ప్రాజెక్టులో మంజూరు
యాదగిరిగుట్ట కొండపైకి రోప్‌వే.. పర్వతమాల ప్రాజెక్టులో మంజూరు

Yadagiri Gutta: యాదగిరిగుట్ట కొండపైకి రోప్‌వే.. పర్వతమాల ప్రాజెక్టులో మంజూరు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 25, 2025
08:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంకి వెళ్లే భక్తులకు త్వరలో మరింత సౌలభ్యం లభించనుంది. పర్వతమాల ప్రాజెక్టులో భాగంగా ఆలయ గుట్టపైకి నేరుగా చేరుకునే విధంగా రోప్‌వే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇదే తరహాలో రాష్ట్రంలో మరో మూడు ప్రాంతాల్లో కూడా రోప్‌వేలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పనులన్నిటికీ భారత జాతీయ రహదారుల అథారిటీ (ఎన్‌హెచ్‌ఏఐ) పరిధిలోని నేషనల్ హైవేస్ లాజిస్టిక్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్‌)కు బాధ్యతలు అప్పగించారు. ప్రణాళిక ప్రకారం యాదగిరిగుట్టలో 1.1కి.మీ.పొడవులో,నల్గొండ జిల్లా కేంద్రంలోని హనుమాన్‌కొండలో 1.2 కి.మీ.,నాగార్జునసాగర్‌లోని నాగార్జునకొండ నుంచి డ్యామ్‌ వరకు 1.7 కి.మీ.,పెద్దపల్లి జిల్లా మంథనిలోని రామగిరికోట వద్ద 2.4 కి.మీ. మేరకు రోప్‌వే ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

వివరాలు 

బిడ్‌లకు ఆహ్వానం 

ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్‌) కోసం ఎన్‌హెచ్‌ఏఐ ఇప్పటికే బిడ్‌లను ఆహ్వానించింది. ఈ బిడ్‌ల సమర్పణకు అక్టోబర్ 21 వరకు గడువు నిర్ధారించారు. దేశవ్యాప్తంగా మొత్తం 200 రోప్‌వేలను నిర్మించాలనే లక్ష్యంతో కేంద్రం ముందుకు సాగుతుండగా, తాజాగా ఉత్తరాఖండ్‌లో రెండు, తెలంగాణలో నాలుగు రోప్‌వేలకు పచ్చజెండా ఊపి చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం వారాంతాలు, ముఖ్యంగా పర్వదినాల్లో యాదగిరిగుట్ట ఘాట్‌రోడ్‌పై వాహనాలు పొడవాటి క్యూలలో నిలిచి ట్రాఫిక్ స్తంభించిపోతుంది. రోప్‌వే ఏర్పాటు పూర్తయితే భక్తులు సూటిగా కొండపైకి చేరుకునే సౌకర్యం పొందుతారు.

వివరాలు 

భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారం 

అలాగే, బౌద్ధ క్షేత్రంగా పేరొందిన నాగార్జునకొండకు దేశీయ, అంతర్జాతీయ స్థాయి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అక్కడ కృష్ణానది పైగా రోప్‌వే ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు నల్గొండ జిల్లా కేంద్రంలోని హనుమాన్‌కొండలో రోప్‌వే నిర్మాణం చేపట్టనున్నారు. అదేవిధంగా, కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం-మంథని-రామగిరికోటను కలిపి పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో భాగంగా రామగిరికోట వద్ద రోప్‌వే ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.