APSRTC: సంక్రాంతికి ప్రత్యేక బస్సులతో 3 రోజులు రికార్డు స్థాయిలో ఆదాయం
ఈ వార్తాకథనం ఏంటి
సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తమ సొంతూళ్లకు వచ్చిన ప్రయాణికులు, తిరిగి వెళ్లిన వారికోసం ఏపీఎస్‌ఆర్టీసీ 9,097 ప్రత్యేక బస్సులను నడిపించి రూ.21.11 కోట్ల రాబడిని సాధించింది.
మొదట 7,200 బస్సులు నడపాలనే ఏర్పాట్లు చేశాయి,కానీ ప్రయాణికుల రద్దీ పెరిగినందున 9,097 బస్సులను నడిపినట్లు ఆర్టీసీ సంస్థ ప్రకటించింది.
సాధారణ రోజుల్లో ఆర్టీసీకి రోజువారీ ఆదాయం సగటున రూ.16-17 కోట్లు ఉండగా, ఈ ప్రత్యేక బస్సుల కారణంగా జనవరి 20న ఆర్టీసీ చరిత్రలో అత్యధికంగా రూ.23.71 కోట్ల రాబడి సమకూరింది.
జనవరి 13 నుంచి 20 వరకు ప్రత్యేక బస్సులు నడపగా, ఈ మూడు రోజుల్లో రూ.20 కోట్ల పైగా ఆదాయం సాధించారు.
వివరాలు
ప్రయాణికులను తరలించేందుకు ప్రైవేటు బస్సులు, స్కూల్ బస్సులు
అదనపు ఛార్జీలు లేకుండా బస్సులు నడిపించడంతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల వైపు ఎక్కువగా మొగ్గుచూపినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు తెలిపారు.
సంక్రాంతి రద్దీ సమయంలో ఆర్టీసీ బస్సులు సరిపోకపోతే, సమీప పట్టణాలకు ప్రయాణికులను తరలించేందుకు ప్రైవేటు బస్సులు, స్కూల్ బస్సులను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఈ ప్రకారం, జనవరి 11న గుంటూరులో నాలుగు ప్రైవేటు బస్సులను ఉపయోగించారు, 12న విజయవాడలో నాలుగు స్కూల్ బస్సుల్లో ప్రయాణికులను తరలించారు.
ప్రణాళికాబద్ధంగా ఆర్టీసీ బస్సులను నడిపించడంతో ప్రజలకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా చూసుకున్నామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.