
Chhangur Baba: విదేశాల నుంచి రూ.500 కోట్ల ప్రవాహం.. చంగూర్‌బాబా చీకటి భాగోతం ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
విదేశాల నుంచి నిధులను సమకూర్చి, అక్రమ మతమార్పిడులకు పాల్పడుతున్న జలాలుద్దీన్ అలియాస్ చంగూర్‌బాబా ఆర్థిక వ్యవస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విస్తృత దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే అతడికి సంబంధించిన 30 బ్యాంక్ ఖాతాలపై దర్యాప్తు జరుపుతుండగా, తాజాగా మరో 18 ఖాతాల సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ ఖాతాల ద్వారా సుమారుగా రూ.68 కోట్లు లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. వాటిలోని రూ.7 కోట్లు గత మూడునెలల వ్యవధిలోనే విదేశాల నుంచి బదిలీ అయినట్లు తేలింది. ఈ ఖాతాలన్నీ అతడి మతమార్పిడి ముఠాలో భాగంగా ఉన్నాయని విచారణాధికారులు పేర్కొంటున్నారు.
Details
మతమార్పిడికి కోడ్ భాషలు
చంగూర్‌బాబా తన మతమార్పిడి కార్యకలాపాలను గుప్తంగా నిర్వహించేందుకు కోడ్ నేమ్‌లు ఉపయోగించేవాడు. యూపీ ఏటీఎస్ (UP ATS) తాజాగా దీన్ని ఛేదించింది. లక్ష్యంగా ఎంచుకున్న మహిళలను 'ప్రాజెక్ట్' మతమార్పిడిని 'మిట్టీ పలట్నా' మానసికంగా ప్రభావితం చేయడాన్ని 'కాజల్ కర్నా' జలాలుద్దీన్‌తో భేటీ ఏర్పాటు చేయడాన్ని 'దీదార్' అని పిలుచుకునేవారు. ఈ కోడ్‌లు అతడి మతమార్పిడి ముఠా కార్యకలాపాల్లో నియమితంగా ఉపయోగించబడినట్లు యూపీ ఏటీఎస్ వెల్లడి చేసింది.
Details
రూ.వందల కోట్ల విదేశీ లావాదేవీలు!
అధికారుల అంచనాల ప్రకారం, చంగూర్‌బాబా ఆర్థిక సామ్రాజ్యం ఎంతో విస్తృతంగా ఉండొచ్చని భావిస్తున్నారు. అతడికి భారత్, నేపాల్ దేశాల్లో కలిపి 100కి పైగా బ్యాంక్ ఖాతాలున్నట్లు అనుమానిస్తున్నారు. గత మూడు సంవత్సరాల్లోనే రూ.500 కోట్లకు పైగా విదేశీ నిధులు చంగూర్‌బాబాకు అందాయని, ఇందులో రూ.300 కోట్లు పూర్తిగా అక్రమ మార్గాల్లో వచ్చినవే అని అధికారులు చెబుతున్నారు. ఈ నిధుల ప్రవాహానికి నేపాల్ సరిహద్దులను వినియోగించినట్లు సమాచారం. ముఖ్యంగా పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి అతడికి నిధులు అందినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Details
విల్లాలోనే విచారణ, భారీగా ఆధారాలు
బలరామ్పూర్‌లోని అతడి భారీ విల్లాను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. భద్రత కోసం కమాండోలను మోహరించారు. ఈ భవనంలో మొత్తం 70 గదులు ఉండగా, ఇందులో 40 గదులను కూలగొట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ భవనం అతడి అత్యంత సన్నిహితురాలు నీతు అలియాస్ నస్రీన్ పేరుపై నమోదైంది. ఈటీఎస్ బృందం తాజాగా చంగూర్‌బాబాను ఈ భవనానికి తీసుకొచ్చి 40 నిమిషాలపాటు ఇంటరాగేషన్ నిర్వహించింది. విచారణలో ముఖ్యమైన పత్రాలు, ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు.