LOADING...
Medaram: మేడారం జాతరకు 3,495 బస్సులు.. 25 నుంచి 31వ తేదీ వరకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
25 నుంచి 31వ తేదీ వరకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

Medaram: మేడారం జాతరకు 3,495 బస్సులు.. 25 నుంచి 31వ తేదీ వరకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2026
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రసిద్ధ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర నేపథ్యంలో ఆర్టీసీ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 3,495 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళిక రూపొందించింది. జనవరి 25 నుంచి 31 వరకు ఈ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. జాతర ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలపై అదనంగా 50 శాతం వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఐదు రీజియన్ల నుంచి ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు. వరంగల్‌ రీజియన్‌ నుంచి 1,905, కరీంనగర్‌ నుంచి 700, ఆదిలాబాద్‌ నుంచి 369, హైదరాబాద్‌ నుంచి 281, ఖమ్మం రీజియన్‌ నుంచి 240 బస్సులు మేడారానికి వెళ్లనున్నాయి.

వివరాలు 

జాతరకు బస్సుల ద్వారా సుమారు 20 లక్షల మంది భక్తులు

ప్రయాణికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్యలో అవసరమైన మార్పులు చేసే అవకాశం ఉందని ఆర్టీసీ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ జాతరకు బస్సుల ద్వారా సుమారు 20 లక్షల మంది భక్తులు ప్రయాణిస్తారని ఆర్టీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో అమలులో ఉన్న 'మహాలక్ష్మి' ఉచిత ప్రయాణ పథకాన్ని మేడారం ప్రత్యేక బస్సుల్లో కూడా అమలు చేస్తామని ఆర్టీసీ స్పష్టం చేసింది.

వివరాలు 

ఛార్జీలు ఎంతంటే?

రాష్ట్రవ్యాప్తంగా 50కి పైగా ప్రాంతాల నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు. హైదరాబాద్‌ నుంచి ఎక్స్‌ప్రెస్‌ బస్సు ఛార్జీ రూ.600గా ఉండగా, గరుడప్లస్‌కు రూ.1,110గా నిర్ణయించారు. వరంగల్‌ నుంచి ఎక్స్‌ప్రెస్‌కు రూ.250, గరుడప్లస్‌కు రూ.500గా ఛార్జీలు ఖరారు చేశారు. మేడారం జాతరలో భక్తుల రాకపోకలను సులభతరం చేసేందుకు 50 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 50 క్యూలైన్లు ఏర్పాటు చేయగా, ఒకేసారి సుమారు 20 వేల మంది ప్రయాణికులు నిలిచే విధంగా సదుపాయాలు కల్పించారు. ట్రాఫిక్‌ నిర్వహణ, భద్రత పర్యవేక్షణ కోసం బస్‌స్టేషన్‌లో 76 సీసీ కెమెరాలతో కూడిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement