LOADING...
Bhatti vikramarka: ఎంజీబీఎస్‌లో ఘనంగా మహిళల 200 కోట్ల ప్రయాణ వేడుకలు
ఎంజీబీఎస్‌లో ఘనంగా మహిళల 200 కోట్ల ప్రయాణ వేడుకలు

Bhatti vikramarka: ఎంజీబీఎస్‌లో ఘనంగా మహిళల 200 కోట్ల ప్రయాణ వేడుకలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2025
02:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశం కల్పించడం వల్ల ఆర్టీసీ ఆర్థికంగా బలోపేతం అవుతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన ఉచిత టికెట్ల విలువను ప్రభుత్వం నిరంతరం ఆర్టీసీకి చెల్లిస్తోందని స్పష్టం చేశారు. బుధవారం ఎంజీబీఎస్‌లో నిర్వహించిన''మహాలక్ష్మి-200 కోట్ల మహిళల ప్రయాణం''వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 2,400 కొత్త బస్సులు కొనుగోలు చేసినట్టు చెప్పారు. అలాగే,హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు 2,800ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు సంస్థ ప్రణాళికలు రూపొందిస్తున్నదన్నారు. ఉచిత ప్రయాణం ఒక్కటే కాకుండా, మహిళలే ఆర్టీసీ బస్సుల యజమానులుగా మారిన దృష్ట్యా ఇది సమాజానికి గర్వకారణంగా మారిందన్నారు.

వివరాలు 

కొత్త బస్సుల కొనుగోలుతో పాటు నియామకాలు

రాష్ట్రవ్యాప్తంగా రూ.20 వేల కోట్ల వ్యయంతో రహదారుల మరమ్మతులు,అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఆర్టీసీ లాభాల్లోకి వస్తున్న ప్రభుత్వ సంస్థగా మారిందని,వచ్చిన ఆదాయాన్ని ఉపయోగించి కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నదన్నారు. మహాలక్ష్మి పథకం ప్రారంభానికి ముందు రోజుకు సగటున 45లక్షల మంది ప్రయాణించేవారైతే, ప్రస్తుతం ఈ సంఖ్య 65 లక్షలకు చేరిందని వివరించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న ఆర్టీసీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళల 200 కోట్ల ప్రయాణాల ఘనతను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా 97డిపోలు,324 బస్ స్టేషన్లలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజల పెరిగిన ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త బస్సుల కొనుగోలుతో పాటు నియామకాలు చేపడుతున్నట్టు వివరించారు.

వివరాలు 

మహిళలు ఉచితప్రయాణాల ద్వారా దాదాపు రూ.6680కోట్లు ఆదా

రహదారులు,భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ,ప్రజలరవాణా అవసరాలను తీర్చేందుకు ప్రతి గ్రామం నుంచి మండలానికి,మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి కొత్త రహదారుల నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఆర్టీసీఎండీ సజ్జనార్ మాట్లాడుతూ,మహాలక్ష్మి పథకం అమలు ముందస్తుగా ఆక్యుపెన్సీ రేషియో 69 శాతంగా ఉండగా,ప్రస్తుతం అది 97శాతానికి పెరిగిందని వెల్లడించారు. అనంతరం ఉచిత బస్సు సేవలు వినియోగిస్తున్న మహిళలు,ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేస్తున్న ఆర్టీసీ సిబ్బందిని మంత్రులు సన్మానించారు. మహిళలు ఉచితప్రయాణాల ద్వారా దాదాపు రూ.6680కోట్లు ఆదా చేసుకున్నారని పేర్కొంటూ,ఆ మొత్తానికి గాను చెక్కును ప్రభుత్వం తరఫున ఆర్టీసీ ఉన్నతాధికారులకు అందజేశారు. ఈకార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య,రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ తదితరులు హాజరయ్యారు.