Andhra Pradesh: RTE కింద 25% కోటా సీట్లు: 2026-27 ప్రైవేటు పాఠశాలల ప్రవేశాల షెడ్యూల్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
విద్యా హక్కు చట్టం (RTE) కింద 2026-27 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో అమలులో ఉన్న 25 శాతం కోటా సీట్ల ప్రవేశాలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు విడుదల చేశారు. ఒకటో తరగతిలో చేర్పుల కోసం ఈ నెల 20 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థులు http://cse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా లేదా గ్రామ, వార్డు సచివాలయాలు, మండల విద్యా వనరుల కేంద్రాలు, సంబంధిత పాఠశాలల్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. మరిన్ని వివరాలు లేదా సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 8599ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
వివరాలు
పిల్లల వయస్సు ధ్రువీకరణ పత్రం తప్పనిసరి
ప్రస్తుత చిరునామా నిర్ధారణ కోసం తల్లిదండ్రుల ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు,రేషన్ కార్డు,భూమి హక్కుల పత్రం, ఉపాధి హామీ జాబ్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్ బిల్లు లేదా అద్దె ఒప్పంద పత్రంలో ఏదో ఒకదాన్ని ప్రామాణికంగా స్వీకరిస్తారు. అలాగే పిల్లల వయస్సు ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ పాఠశాలల్లో ప్రవేశాలకు పిల్లలు 2020 ఏప్రిల్ 2 నుంచి 2021 మార్చి 31 మధ్య జన్మించి, ఐదేళ్ల వయస్సు నిండి ఉండాలి. అదే విధంగా రాష్ట్ర సిలబస్ పాఠశాలల్లో చేర్పులకు 2020 జూన్ 2 నుంచి 2021 మే 31 మధ్య జన్మించి ఉండాలి. ఈ ప్రవేశాలపై అధికారిక ప్రకటనను శుక్రవారం విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
వివరాలు
మార్చి 25న తొలి విడత సీట్ల కేటాయింపు
షెడ్యూల్ ప్రకారం, ఈ నెల 7 నుంచి 16 వరకు ప్రైవేటు పాఠశాలలు తమ వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. అనంతరం 20 నుంచి మార్చి 10 వరకు విద్యార్థుల ఆన్‌లైన్ వివరాల నమోదు జరుగుతుంది. మార్చి 17న గ్రామ, వార్డు సచివాలయాల డేటా ఆధారంగా విద్యార్థుల అర్హతను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. మార్చి 25న తొలి విడత సీట్ల కేటాయింపు చేపడతారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 7 వరకు ప్రవేశాల ధ్రువీకరణ కొనసాగుతుంది. తరువాత ఏప్రిల్ 12న రెండో విడత సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఏప్రిల్ 13 నుంచి 23 వరకు పాఠశాలల ద్వారా విద్యార్థుల ప్రవేశాలను ధ్రువీకరిస్తారు.