Sabarimala: శబరిమల బంగారు విగ్రహాల కేసు.. ఈడీకి దర్యాప్తు అనుమతి
ఈ వార్తాకథనం ఏంటి
శబరిమల అయ్యప్ప దేవాలయంలోని బంగారు విగ్రహాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు కొల్లాం విజిలెన్స్ కోర్టు అనుమతి మంజూరు చేసింది. దీనిలో భాగంగా కేసుకు సంబంధించిన కీలక పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు సహా అన్ని సంబంధిత దస్త్రాలను కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ)ను కోర్టు ఆదేశించింది. శబరిమల ఆలయంలోని విగ్రహాలకు తాపడం చేసిన బంగారం బరువులో వ్యత్యాసం బయటపడటంతో ఈ కేసు అప్పట్లో తీవ్ర సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఎలాంటి కుట్ర దాగి ఉందా? అనే కోణంలో అనుమానాలు వెల్లువెత్తాయి.
Details
మనీ లాండరింగ్ కోణంలో విచారణ జరిపేందుకు గ్రీన్ సిగ్నల్
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఉన్నికృష్ణన్ పొట్టి గతంలో శబరిమల ఆలయ పూజారికి సహాయకుడిగా పనిచేశాడు. అతని వెనుక భారీ శక్తులు ఉన్నాయనే ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. దేవస్థానం బోర్డు అధ్యక్షుడికి అనుకూలంగా ఉన్నికృష్ణన్ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని తేలికగా పరిగణించలేమని, అలాగే దేవస్థానం మాన్యువల్ ఉల్లంఘనలపై పలు సందేహాలు ఉన్నాయని కేరళ హైకోర్టు ఇప్పటికే వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఎస్‌ఐటీ దర్యాప్తు కొనసాగుతుండగా, తాజాగా మనీ లాండరింగ్ కోణంలో విచారణ జరిపేందుకు ఈడీకి విజిలెన్స్ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.