LOADING...
Jal Jeevan Mission 2.0 : 2028 నాటికి ప్రతి ఇంటికీ తాగునీరు: సీఎం చంద్రబాబు  
2028 నాటికి ప్రతి ఇంటికీ తాగునీరు: సీఎం చంద్రబాబు

Jal Jeevan Mission 2.0 : 2028 నాటికి ప్రతి ఇంటికీ తాగునీరు: సీఎం చంద్రబాబు  

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 24, 2026
04:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

హర్ ఘర్ జల్ కార్యక్రమం లక్ష్యంగా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ నిరంతరాయంగా సురక్షిత తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. జల్ జీవన్ మిషన్ 2.0 ద్వారా 2028 నాటికి రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు తాగునీటి కుళాయిలను ఏర్పాటు చేయడం లక్ష్యమని వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పంద కార్యక్రమంలో సీఎం తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు.

వివరాలు 

పంచాయతీలకు నిర్వహణ బాధ్యతలు

గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థను సమర్థంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చంద్రబాబు చెప్పారు. ఈ క్రమంలోనే 2025 సెప్టెంబర్‌లో సమగ్ర విధానాన్ని ప్రకటించామని గుర్తు చేశారు. నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ బాధ్యతలను పంచాయతీలకు అప్పగించామని వెల్లడించారు. జల్ జీవన్ మిషన్ అమలులో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. ఈ మిషన్‌ను 2028 వరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

వివరాలు 

పోలవరం పూర్తి లక్ష్యం.. కేంద్ర సహకారం కోరిన సీఎం

పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు. జల్ జీవన్ మిషన్ 2.0 ఒప్పందం అనంతరం పాటిల్ స్పందించారు. జేజేఎం 2.0కు కేంద్రం అనుమతి వివిధ రాష్ట్రాల అభ్యర్థనల మేరకు జల్ జీవన్ మిషన్ 2.0కు కేంద్రం ఆమోదం తెలిపిందని సీఆర్ పాటిల్ చెప్పారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో ఈ విషయంపై చర్చించారని, మిషన్ పొడిగింపుకు ప్రతిపాదించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

వివరాలు 

తొలి దశలో 16 కోట్ల ఇళ్లకు నీరు

జల్ జీవన్ మిషన్ తొలి దశలో దేశవ్యాప్తంగా 16 కోట్ల ఇళ్లకు తాగునీటి కుళాయిలను అందించామని పాటిల్ వివరించారు. ప్రాజెక్టులో ఉన్న లోపాలను సరిదిద్దుతూ నిర్వహణ చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఇంకా 3 కోట్ల ఇళ్లకు సురక్షిత తాగునీరు అందించాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నీటి నాణ్యత పరీక్షల కోసం డ్వాక్రా మహిళల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా 9 కోట్ల మహిళలు దూరం నుంచి నీరు మోసుకురావాల్సిన కష్టాల నుంచి విముక్తి పొందుతారని తెలిపారు. జేజేఎం 2.0తో ఏపీలో ప్రతి ఇంటికీ కుళాయి లక్ష్యం సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

వివరాలు 

వికసిత్ భారత్‌కు తాగునీరు కీలకం

2047 వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు చేరడం అత్యంత అవసరమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రైతులకు సాగునీరు రెండు పూటలా అందితే వారు సంతోషంగా ఉంటారని చెప్పారు. జేజేఎం 2.0 అమలుపై త్వరలో జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ సమావేశం నిర్వహించి లక్ష్యాలను ఖరారు చేయాలని సూచించారు. పీఎం జన్ మన్, పీఎం జన్ భాగీదారి కార్యక్రమాల ద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా తాగునీరు అందించేందుకు నిధులను వినియోగించాలని కోరారు.

వివరాలు 

ఎంఓయూతో మౌలిక వసతుల బలోపేతం

ఢిల్లీలోని కేంద్ర జలవనరుల శాఖ కార్యాలయంలో జేజేఎం 2.0పై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పంచాయతీల ఆధ్వర్యంలో నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ మరింత బలోపేతం అవుతుంది. 2028 డిసెంబర్ నాటికి హర్ ఘర్ జల్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జల్ శక్తి కార్యదర్శి అశోక్ కుమార్ మీనా, రాష్ట్ర పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అమరావతి నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా హాజరయ్యారు.

Advertisement