Bengaluru traffic: బెంగళూరు ట్రాఫిక్‌పై ఎంపీ రాజీవ్ రాయ్ ఫైర్.. సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవలి కాలంలో బెంగళూరు నగర ట్రాఫిక్ సమస్యపై పలువురు ప్రముఖులు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఉత్తరప్రదేశ్ ఎంపీ రాజీవ్ రాయ్ కూడా ఇదే అంశంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసం పోలీసులను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లాల్సి ఉండటంతో ఎంపీ రాజీవ్ రాయ్ ఎయిర్‌పోర్ట్ వైపు బయలుదేరారు. ఆ సమయంలో నగరంలోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లు తీవ్రంగా ఉండటంతో ఆయన ప్రయాణానికి తీవ్రంగా అంతరాయం కలిగింది.
వివరాలు
నగర ట్రాఫిక్ నిర్వహణ అత్యంత దారుణం
విమానం మిస్ అవుతుందన్న ఆందోళనతో స్థానిక ట్రాఫిక్ పోలీసులకు ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినా, ఎవరూ కాల్ లిఫ్ట్ చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో స్పందించిన రాజీవ్ రాయ్.. బెంగళూరులో ట్రాఫిక్ కారణంగా రోడ్లపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రికి క్షమాపణ చెబుతూనే.. నగర ట్రాఫిక్ నిర్వహణ అత్యంత దారుణంగా ఉందని విమర్శించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే పనికిరాని ట్రాఫిక్ పోలీసులు ఉన్నారని, ఫోన్ కాల్స్ కూడా స్వీకరించరని ఆక్షేపించారు. వారిని సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించినా ఎవరూ స్పందించలేదని పేర్కొన్నారు.
వివరాలు
బెంగళూరు నగర ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నఅసమర్థ అధికారులు
రాజ్‌కుమార్ ఘాట్ రోడ్డుపై గంటపాటు ఒకేచోట ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయానని, ఆ సమయంలో ఢిల్లీ వెళ్లాల్సిన విమానం మిస్ అవుతుందేమోనన్న భయంతో తీవ్ర టెన్షన్‌కు గురయ్యానని వెల్లడించారు. రోడ్లపై ఒక్క పోలీసు కూడా కనిపించలేదని, ఇలాంటి అసమర్థ అధికారులు బెంగళూరు నగర ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బెంగళూరు ట్రాఫిక్ దేశవ్యాప్తంగా అపఖ్యాతిని సంపాదించుకుందని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్‌గా మారింది.