Electricity Bills: కరెంట్ బిల్లులో కొత్త విధానం.. ఎంత వాడారన్నది కాదు, ఎప్పుడు వాడారన్నదే ముఖ్యం!
ఈ వార్తాకథనం ఏంటి
ఇంట్లో ఏసీ, వాషింగ్ మెషీన్,గీజర్ వంటి విద్యుత్ ఉపకరణాలను ఎప్పుడు పడితే అప్పుడు వినియోగిస్తున్నారా?ఇకపై అలా చేస్తే విద్యుత్ బిల్లులు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఎంత విద్యుత్ వినియోగించారనే దాని ఆధారంగా బిల్లు చెల్లిస్తుండగా.. ఇకపై ఏ సమయంలో విద్యుత్ వాడారన్నది కూడా కీలకం కానుంది. ఒకే పరిమాణంలో విద్యుత్ వినియోగించినప్పటికీ,వాడిన సమయాన్ని బట్టి వేర్వేరు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉండే సమయాల్లో అధిక ధరలు, డిమాండ్ తక్కువగా ఉండే వేళల్లో తక్కువ ఛార్జీలు వసూలు చేసేలా 'టైమ్ ఆఫ్ డే' (ToD) టారిఫ్ విధానానికి సంబంధించిన ముసాయిదా నిబంధనలను కేంద్రం ప్రతిపాదించింది.
వివరాలు
2027 ఏప్రిల్ నుంచి కొత్త విధానం
ఈ విధానం అమల్లోకి వస్తే విద్యుత్ వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ వినియోగించే సమయాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది.
తద్వారా విద్యుత్ డిమాండ్‌ను సమతుల్యం చేయడం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం 2027 ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
తొలుత 10 కిలోవాట్లకు పైగా విద్యుత్ డిమాండ్ ఉన్న వినియోగదారులకు ఈ విధానాన్ని వర్తింపజేస్తారు.
2028 ఏప్రిల్ 1 నాటికి వీరందరికీ అమలు చేయాలని ప్రతిపాదించారు.
అనంతరం సాధారణ గృహ విద్యుత్ వినియోగదారులకు 2029 ఏప్రిల్ 1 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురానున్నారు.
అయితే రైతులకు మాత్రం కేంద్రం ఊరటనిచ్చింది. వ్యవసాయ రంగానికి ఈ విధానం నుంచి మినహాయింపు కల్పించింది.
వివరాలు
బ్యాటరీ నిల్వ తప్పనిసరి?
రాష్ట్రాల్లో విద్యుత్ డిమాండ్, పునరుత్పాదక ఇంధన లభ్యత, పవర్ ఎక్స్ఛేంజ్‌లో విద్యుత్ ధరలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండళ్లు వివిధ సమయాలను నిర్ణయిస్తాయి.
ఆయా సమయాలకు అనుగుణంగా విద్యుత్ ఛార్జీలను కూడా ఖరారు చేస్తాయి. దీంతో ఒక్కో రాష్ట్రంలో విద్యుత్ వినియోగ సమయాలు,వాటి ధరలు వేర్వేరుగా ఉండే అవకాశం ఉంది.
సౌర విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధనాన్ని సొంతంగా ఉత్పత్తి చేసుకునే 10 కిలోవాట్లకు పైగా విద్యుత్ సామర్థ్యం ఉన్న వినియోగదారులకు మరో నిబంధన తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదించింది.
వీరు రోజువారీ విద్యుత్ ఉత్పత్తిలో కనీసం 20శాతాన్ని నిల్వ చేసుకునేలా స్టోరేజీ బ్యాటరీలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ నిబంధన 2028 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
వివరాలు
కొత్త విద్యుత్ కనెక్షన్లకు గడువులు
కొత్త విద్యుత్ కనెక్షన్ల మంజూరులోనూ కేంద్రం కీలక మార్పులు ప్రతిపాదించింది.
దరఖాస్తు చేసుకున్న తర్వాత వినియోగదారులు ఎక్కువ రోజులు వేచి ఉండకుండా ప్రాంతాల వారీగా గడువులను నిర్ణయించింది.
మెట్రోపాలిటన్ నగరాలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మూడు రోజుల్లోనే కొత్త కనెక్షన్ ఇవ్వాలి.
ఇతర పురపాలక సంఘాల పరిధిలో ఏడు రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 15 రోజులు, కొండ ప్రాంతాల్లో 30 రోజుల్లో కనెక్షన్ మంజూరు చేయాలి.
అయితే విద్యుత్ లైన్లు వేయడం, కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం వంటి పనులు అవసరమైతే 90 రోజుల వరకు సమయం తీసుకోవచ్చు.
వివరాలు
విద్యుత్ బిల్లుల్లో అక్రమాలకు అడ్డుకట్ట
విద్యుత్ బిల్లుల్లో జరిగే అక్రమాలు,తప్పులను అరికట్టేందుకు కూడా ముసాయిదా నిబంధనల్లో కీలక మార్పులు చేశారు.
వినియోగదారుడి గత ఆరునెలల సగటు బిల్లుతో పోలిస్తే తాజా బిల్లు ఐదురెట్లు ఎక్కువగా వచ్చినా, లేదా ఆ సగటులో ఐదో వంతు కంటే తక్కువగా నమోదైనా బిల్లింగ్ వ్యవస్థ దాన్ని అనుమానాస్పదంగా గుర్తించాలి.
ఇలాంటి బిల్లులపై అధికారులు 30రోజుల్లోగా విచారణ జరిపి సమస్యను పరిష్కరించాలి.
వివరాలు
విద్యుత్ బిల్లుల్లో అక్రమాలకు అడ్డుకట్ట
అయితే బిల్లులోని వ్యత్యాసంపై విచారణ పూర్తయ్యే వరకు వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
సమస్య పరిష్కారమయ్యేంత వరకు గత ఆరు నెలల సగటు విద్యుత్ బిల్లును చెల్లించి సరఫరా నిలిచిపోకుండా చూసుకోవచ్చు.
ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే విద్యుత్ వినియోగ సమయాల నుంచి బిల్లింగ్ విధానం,కొత్త కనెక్షన్ల మంజూరు వరకు అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయి.