Sanjay Raut: ఎంపీల కొనుగోలుకు రూ.15 కోట్లు.. ప్రైవేట్ జెట్ పంపారంటూ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి శివసేన చీలికకు సంబంధించిన ఊహాగానాలు జోరందుకున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కు చెందిన కొందరు ఎంపీలు ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరనున్నారనే ప్రచారం నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీలను కొనుగోలు చేసేందుకు ఒక్కొక్కరికి రూ.15 కోట్ల చొప్పున అడ్వాన్స్‌లు చెల్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. మంగళవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన రౌత్.. "మహారాష్ట్ర ఎంపీలను కొనుగోలు చేయడానికి ఒక్కొక్కరికి రూ.15 కోట్ల అడ్వాన్స్‌లు ఇస్తున్నారని సమాచారం అందింది. ఇది షాకింగ్ మాత్రమే కాకుండా అసహ్యకరమైన చర్య" అని వ్యాఖ్యానించారు.
వివరాలు
బీజేపీ డబ్బుతో కొనుగోలు చేశారు
అయితే పార్టీకి తక్షణ ప్రమాదం లేదని, పరిస్థితిని ఎదుర్కొనే సామర్థ్యం తమకు ఉందని ఆయన స్పష్టం చేశారు.
కొందరు ఎంపీలు వేరు గ్రూప్ ఏర్పాటు చేసే అవకాశాల నేపథ్యంలోనే తాను ఢిల్లీలో ఉన్నాననే ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు.
ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్ రౌత్ మాట్లాడుతూ, "ఉద్ధవ్ ఠాక్రే ప్రతి ఎంపీ కోసం ఎంతో కష్టపడ్డారు.
తిరుగుబాటు చేస్తున్న వారు అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించలేరు. బీజేపీ డబ్బుతో ఎంపీలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
కానీ వారు విజయవంతం కాలేరు. మేమంతా బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతాలను అనుసరించే కార్యకర్తలమని అన్నారు.
వివరాలు
ప్రత్యేకంగా చార్టర్డ్ విమానం పంపించారు
బుధవారం ఉదయం మరోసారి స్పందించిన రౌత్.. నాందేడ్ విమానాశ్రయం నుంచి ఇద్దరు ఎంపీలను తరలించేందుకు ప్రత్యేక చార్టర్డ్ విమానం పంపించారని ఆరోపించారు.
తిరుగుబాటు ఎంపీలను ఉద్దేశించి వ్యంగ్యంగా స్పందిస్తూ, "ఒకప్పుడు ఆటోలో ప్రయాణించే స్థోమత కూడా లేని వారికి, ఠాక్రే పేరు ప్రైవేట్ విమానాల్లో ప్రయాణించే స్థాయిని ఇచ్చింది" అని వ్యాఖ్యానించారు.
వివరాలు
తిరుగుబాటు ఎంపీలపై చర్యలకు సిద్ధమైన యూబీటీ
పార్టీలో చీలిక ప్రచారం నేపథ్యంలో శివసేన (యూబీటీ) అప్రమత్తమైంది.
బుధవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలో పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
అన్ని ఎంపీలు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. సమావేశానికి గైర్హాజరయ్యే ఎంపీలపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇదే సమయంలో పార్టీ తన న్యాయపరమైన వ్యూహాన్ని కూడా సిద్ధం చేస్తోంది. తిరుగుబాటు వర్గాన్ని పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం, పార్టీ క్రమశిక్షణ నిబంధనల పరిధిలోకి తీసుకురావడానికి న్యాయపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
వివరాలు
షిండే వర్గంతో సంప్రదింపుల్లో ఆరుగురు ఎంపీలు?
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో సంప్రదింపులు జరుపుతున్నారు.
వారిలో సంజయ్ దినా పాటిల్, సంజయ్ దేశ్‌ముఖ్, నాగేశ్ పాటిల్ అష్టికర్, ఓంరాజే నింబాల్కర్, భౌసాహెబ్ వక్చౌరే, సంజయ్ జాధవ్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక తిరుగుబాటు వర్గంలో చేరారని ప్రచారం జరిగిన మరో ఎంపీ రాజుభాయ్ వాజే మాత్రం ఆ వార్తలను ఖండించారు.
బుధవారం సంజయ్ రౌత్, అనిల్ దేశాయ్, అరవింద్ సావంత్‌లతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని తాను పార్టీతోనే ఉన్నానని సంకేతాలు ఇచ్చారు.
వివరాలు
స్పీకర్‌ను కలవనున్న తిరుగుబాటు ఎంపీలు
తిరుగుబాటు ఎంపీలు త్వరలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసే అవకాశం ఉందని సమాచారం. ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు కోసం లేఖ సమర్పించే అవకాశముందని తెలుస్తోంది.
అనంతరం వారు షిండే శివసేనలో విలీనం అయ్యే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది.
మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎంపీ అరవింద్ సావంత్ కూడా స్పీకర్‌ను కలిసేందుకు సమయం కోరినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సంజయ్ రౌత్, అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్ ఢిల్లీలో మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
వివరాలు
షిండేతో తిరుగుబాటు ఎంపీల భేటీ?
సమాచారం ప్రకారం తిరుగుబాటు ఎంపీలు ఢిల్లీలోని శ్రికాంత్ షిండే నివాసంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో సమావేశమయ్యారు.
శ్రికాంత్ షిండే, ఏక్‌నాథ్ షిండే కుమారుడు కాగా, ఎంపీగా కూడా కొనసాగుతున్నారు. బుధవారం మరోసారి ఈ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాలు
తిరుగుబాటు నేతలకు స్వాగతం: శివసేన
అధికార శివసేన నేత, మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్ణాయక్ తిరుగుబాటు నేతలకు స్వాగతం పలికారు.
"ప్రజాప్రతినిధులకు తమ నాయకత్వంపై నమ్మకం లేకపోతే, బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతాలను విశ్వసిస్తూ ఏక్‌నాథ్ షిండే నాయకత్వాన్ని అంగీకరిస్తే శివసేన తలుపులు వారికి ఎప్పుడూ తెరిచే ఉంటాయి.
భవిష్యత్తులో ఎప్పుడైనా వస్తే వారికి ప్రాధాన్యం ఇస్తామని అన్నారు.
వివరాలు
2022 చీలిక మళ్లీ పునరావృతమవుతుందా?
2022లో ఏక్‌నాథ్ షిండే శివసేనను చీల్చి ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం శివసేన పేరు, పార్టీ గుర్తును కూడా తన వర్గం దక్కించుకుంది.
ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితి ఏర్పడుతుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
ఇటీవల ఉద్ధవ్ ఠాక్రే నివాసం 'మాతోశ్రీ'లో జరిగిన సమావేశం. మొత్తం తొమ్మిది మంది ఎంపీలలో ఐదుగురు హాజరు కాలేదు.
అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, సంజయ్ దినా పాటిల్, రాజుభాయ్ వాజే మాత్రమే ప్రత్యక్షంగా హాజరయ్యారు.
సంజయ్ జాధవ్, సంజయ్ దేశ్‌ముఖ్, ఓంరాజే నింబాల్కర్, భౌసాహెబ్ వక్చౌరే, నాగేశ్ పాటిల్ అష్టికర్ గైర్హాజరయ్యారు.
వివరాలు
సమావేశంలో పాల్గొన్న ఐదుగురు ఎంపీలు
అయితే ఆ ఐదుగురు ఎంపీలు ఆన్‌లైన్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఆసక్తికరంగా, అదే ఐదుగురు ఎంపీలు ఒక రోజు ముందు ఆదిత్య ఠాక్రే పుట్టినరోజు కార్యక్రమానికి కూడా హాజరు కాలేదు.
దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన చీలికపై ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి.