
Saraswathi Pushkaralu: నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి.
ఈ పవిత్ర ఉత్సవాలను మాధవానంద సరస్వతి స్వామి ప్రారంభించారు.
పుష్కరిణి వద్ద రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈనెల 26వ తేదీ వరకు పుష్కరాలు కొనసాగనున్నాయి.
భక్తుల రాకపోకల దృష్ట్యా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఈ ప్రాంతంలో మొదటిసారిగా సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి.
రోజూ దాదాపు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారని అంచనా.
భక్తుల సౌకర్యార్థం ప్రతి రోజూ సాయంత్రం 6.45 గంటల నుంచి 7.35 వరకు సరస్వతి నవరత్న మాల హారతి నిర్వహిస్తారు.
అదనంగా, సాంస్కృతిక, కళాపరమైన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.
వివరాలు
పుష్కరాల కోసం రూ.35 కోట్ల బడ్జెట్
భక్తుల వసతికి తాత్కాలికంగా టెంట్ సిటీని ఏర్పాటు చేయగా, దీని ద్వారా వారు రుసుము చెల్లించి బస చేయవచ్చు.
ఈ పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది.తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ,ఘాట్ల నిర్మాణం,రహదారుల మరమ్మతులు,పార్కింగ్ సదుపాయాలు వంటి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
వివరాలు
86 గదుల వసతి సముదాయాన్నిప్రారంభించనున్న రేవంత్
ఈ గురువారం సాయంత్రం 4.30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సతీమణితో కలిసి కాళేశ్వరం చేరుకోనున్నారు.
వారు పుష్కర స్నానాన్ని ఆచరించి, శ్రీకాళేశ్వర, ముక్తీశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు.
అనంతరం సరస్వతి నదికి నిర్వహించే ప్రత్యేక హారతిలో పాల్గొంటారు. అక్కడ ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల వసతి సముదాయాన్ని ఆయన ప్రారంభిస్తారు. కాళేశ్వరం పుష్కరాల్లో పాల్గొంటున్న తొలి సీఎంగా రేవంత్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతున్నారు.