
Saraswati Pushkaralu: కాళేశ్వరం అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులు: రేవంత్ రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వరం క్షేత్రాన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రూ.200 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌తో కలిసి దేవాలయ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.
2027లో జరగనున్న గోదావరి పుష్కరాల నాటికి అభివృద్ధి పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు.
ఇందుకోసం గ్రీన్ ఛానెల్ ద్వారా నిధుల విడుదల జరుగుతుందని స్పష్టం చేశారు.
వివరాలు
సరస్వతి నది పుష్కర స్నానం ఆచరించడం గౌరవంగా భావిస్తు:న్న సీఎం
సరస్వతి నదిలో పుష్కర స్నానం చేయడం తనకు దక్కిన అత్యంత గౌరవంగా భావిస్తున్నట్లు సీఎం వెల్లడించారు.
వచ్చే మూడు సంవత్సరాల్లో గోదావరి, కృష్ణా నదులతో పాటు మేడారం జాతరను అద్భుతంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.
గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ నుండి హెలికాప్టర్‌లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలతో కలిసి కాళేశ్వరం చేరిన సీఎం, నది ఒడ్డున ఏర్పాటైన సరస్వతి విగ్రహాన్ని మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఆవిష్కరించారు.
వివరాలు
ఆలయ దర్శనాలు.. ప్రత్యేక పూజలు
ప్రధాన అర్చకులు సీఎం, మంత్రులను పూర్ణకుంభంతో స్వాగతించారు.అనంతరం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కలసి శ్రీ కాళేశ్వర స్వామి,ముక్తీశ్వరస్వామి,సరస్వతి దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
వేద పండితులు ఆశీర్వచనాలు చేశారు.అనంతరం మాధవానంద సరస్వతితో ముఖ్యమంత్రి కొంతసేపు సంభాషించారు.ప్రత్యేకంగా నిర్వహించిన మహాహారతిని తిలకిస్తూ పరవశించారని తెలిపారు.
"పుష్కరాల నిర్వహణ నా అదృష్టం": ముఖ్యమంత్రి
నదులు నాగరికతకు మూలం మాత్రమే కాకుండా,దేవతలుగా పూజించబడతాయని సీఎం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తరువాత మొదటిసారిగా సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయని, భక్తుల కోసం ప్రభుత్వం మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తేనుందని తెలిపారు. పుష్కర స్నానం వల్ల ముక్తి లభిస్తుందని చెప్పారు.వచ్చే మూడేళ్లలో జరిగే ఇతర నదుల పుష్కరాల నిర్వహణకు ఈ సరస్వతి పుష్కరాలు పునాది వేశాయన్నారు.
వివరాలు
మంత్రి శ్రీధర్‌బాబు సేవలు ఎంతో ముఖ్యమైనవి
మంథని నియోజకవర్గంలో ఉన్న కాళేశ్వర క్షేత్రం గొప్ప చరిత్ర కలిగినదని సీఎం తెలిపారు.
ఈ ప్రాంతం నుంచి పీవీ నరసింహారావు ఎమ్మెల్యేగా పనిచేశారని, అనంతరం ఆయన వారసుడిగా శ్రీపాదరావు అసెంబ్లీ స్పీకర్‌గా ఘనంగా సేవలందించారని చెప్పారు.
ఇటీవల దావోస్‌లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా శ్రీపాదరావును ప్రశంసించారని గుర్తు చేశారు.
ఇప్పుడు శ్రీధర్‌బాబు మూడో తరం వారసుడిగా రాజకీయాల్లో ఉన్నారని, గత 16-17 నెలల్లో ఆయన హయాంలోనే రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ప్రైవేట్ రంగంలో లక్ష ఉద్యోగాల సృష్టిలో కీలక పాత్ర పోషించినట్టు వివరించారు.
మంథని ప్రజలకు శ్రీధర్‌బాబు లాంటి నాయకుడు దొరకడం అదృష్టమన్నారు.
వివరాలు
సాంస్కృతిక కార్యక్రమాలు, మహా హారతి ప్రత్యేక ఆకర్షణ
సీఎం ప్రసంగం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా, మహాహారతికి ముఖ్య అతిథులు హాజరయ్యారు.
గోదావరి పక్కన మహారాష్ట్ర వైపున భారీ టపాసులు పేల్చడమూ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం సీఎం, మంత్రులు రహదారి మార్గంలో హైదరాబాద్‌కు బయల్దేరారు.
వివరాలు
ప్రభాత వేళ త్రివేణి తీర్థంలో పుష్కర శోభ
గురువారం ఉదయం శివసన్నిధిలోని త్రివేణి సంగమం వద్ద పుష్కరాల అంకురార్పణ జరిగింది.
బృహస్పతి మిథునరాశిలోకి ప్రవేశించడంతో బహుళ తృతీయ తిథిలో వేద మంత్రాల నడుమ పండితులు,రుత్వికులు పుష్కరునికి ఆహ్వానం పలికారు.
సుముహూర్తంగా ఉదయం 5.44 గంటలకు సరస్వతి నదిలో పుష్కరాల ఆరంభం జరిగింది.
తొలిగా మాధవానంద సరస్వతి స్వామి తన శిష్యులతో జ్ఞాన సరస్వతి ఘాట్‌కు చేరుకొని గణపతి, పుష్కర,సరస్వతి దేవతల పూజలు నిర్వహించారు.
త్రివేణి సంగమంలో తొలి పుణ్యస్నానం చేసి తన సత్యదండాన్ని పుష్కర జలాలతో అభిషేకం చేశారు.
మంత్రి శ్రీధర్‌బాబు,శైలజారామయ్యర్ దంపతులు పూజలలో పాల్గొని పుష్కరునికి సారె,చీర సమర్పించారు.
అనంతరం పీఠాధిపతి నదీజలాలతో కాళేశ్వరుడికి అభిషేకం చేశారు. ఆలయంలోని ద్విలింగాలకు సుమారు గంటకు పైగా విశేష పూజలు నిర్వహించారు .