Loading...
Supreme Court: రెండో వివాహం ద్వారా పుట్టిన పిల్లలకూ తల్లి ఆస్తిలో వారసత్వ హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
సుప్రీంకోర్టు కీలక తీర్పు

Supreme Court: రెండో వివాహం ద్వారా పుట్టిన పిల్లలకూ తల్లి ఆస్తిలో వారసత్వ హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2026
02:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళకు మొదటి భర్త కుటుంబం నుంచి సంక్రమించిన ఆస్తిపై సంపూర్ణ యాజమాన్య హక్కులు ఉంటే, ఆమె రెండో వివాహం ద్వారా జన్మించిన పిల్లలు కూడా ఆ ఆస్తిలో వారసత్వ హక్కు పొందేందుకు అర్హులేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీలోని వ్యవసాయ భూమి వారసత్వానికి సంబంధించి దాఖలైన కేసులో అత్యున్నత న్యాయస్థానం ఈ కీలక తీర్పునిచ్చింది. మొదటి భర్త కుటుంబ సభ్యుల వాదనలను తోసిపుచ్చుతూ, రెండో వివాహం ద్వారా జన్మించిన కుమారులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.

వివరాలు 

అసలు వివాదం ఏమిటంటే?

ఖజానో అనే మహిళకు మొదటి భర్త మౌజీ రామ్, వారి కుమారుడు రామ్ చందర్ మరణించిన తర్వాత సుమారు 45 బిగాల వ్యవసాయ భూమి సంక్రమించింది.

అనంతరం ఆమె బాల్‌కిషన్‌ను రెండో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు చంద్ రామ్, చందర్ భాన్ అనే ఇద్దరు కుమారులు జన్మించారు.

అయితే ఖజానో మరణించిన తర్వాత ఆ భూమిపై వివాదం మొదలైంది.

సదరు భూమి తమ పూర్వీకుల ఆస్తి అని మొదటి భర్త కుటుంబ సభ్యులు వాదించారు.

మరోవైపు, రెండో వివాహం ద్వారా జన్మించిన కుమారులు తమకు కూడా ఆస్తిలో వారసత్వ హక్కు ఉందని కోరారు.

వివరాలు 

హిందూ వారసత్వ చట్టం ఏం చెబుతోంది?

ఈ వివాదంపై సుల్తాన్ సింగ్ వర్సెస్ ఫైనాన్షియల్ కమిషనర్ కేసులో సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

హిందూ వారసత్వ చట్టం-1956 అమల్లోకి రాకముందే ఖజానో ఆ భూమిని అనుభవిస్తున్నట్లు న్యాయస్థానం గుర్తించింది.

ఈ నేపథ్యంలో చట్టంలోని సెక్షన్ 14(1) ప్రకారం ఆమెకు గతంలో ఉన్న పరిమిత హక్కులు సంపూర్ణ యాజమాన్య హక్కులుగా మారాయని పేర్కొంది.

దీంతో ఆమె ఆ భూమికి కేవలం సంరక్షకురాలిగా కాకుండా, పూర్తి స్థాయి స్వతంత్ర యజమానిగా హక్కులు పొందినట్లు స్పష్టం చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

రెండో వివాహం పిల్లలకే ఆస్తి..

ఢిల్లీ భూ సంస్కరణల చట్టం-1954 నిబంధనలను కూడా సుప్రీంకోర్టు పరిశీలించింది.

ఖజానో మరణించే సమయానికి అమల్లో ఉన్న వ్యక్తిగత చట్టాల ప్రకారం ఆమెకు చట్టబద్ధ వారసులైన చంద్ రామ్, చందర్ భాన్‌లకే ఆ వ్యవసాయ భూమి చెందుతుందని తేల్చిచెప్పింది.

ఆస్తి మొదట ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి కుటుంబం నుంచి సంక్రమించింది అనే అంశాల కంటే.. మహిళ మరణించే సమయానికి ఆ ఆస్తిపై ఆమెకు ఎలాంటి హక్కులు ఉన్నాయన్నదే కీలకమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

తద్వారా రెండో వివాహం ద్వారా జన్మించిన పిల్లలకు కూడా తల్లి సంపూర్ణ యాజమాన్యంలోని ఆస్తిపై వారసత్వ హక్కు ఉంటుందని స్పష్టం చేసింది.

ADVERTISEMENT