LOADING...
Supreme Court: పన్ను చెల్లింపుదారుల డబ్బుతో నిర్లక్ష్యమా?.. బ్యాంకులు, ఏఆర్‌సీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రజల డబ్బుతో రుణాలు ఇచ్చి వసూళ్లు చేయరా?.. బ్యాంకులను ప్రశ్నించిన సుప్రీం

Supreme Court: పన్ను చెల్లింపుదారుల డబ్బుతో నిర్లక్ష్యమా?.. బ్యాంకులు, ఏఆర్‌సీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 20, 2026
08:47 am

ఈ వార్తాకథనం ఏంటి

పన్ను చెల్లింపుదారుల డబ్బుతో నడిచే బ్యాంకులు రుణాలను ఉదారంగా మంజూరు చేసి, వాటి వసూళ్ల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాల్సిన ప్రభుత్వ ధనం దుర్వినియోగం కావడం ఆందోళనకరమని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ వి. మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. బ్యాంకులు, ఆస్తుల పునర్నిర్మాణ సంస్థలు (ఏఆర్‌సీలు), రుణగ్రహీతల మధ్య లోతైన లాలూచీ వ్యవహారాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం చేసింది. ఇటువంటి వ్యవహారాలు ప్రజల డబ్బుకు నష్టం కలిగించే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించింది.

వివరాలు 

రూ.1,537 కోట్ల బకాయిలపై ప్రశ్నలు

ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.1,537 కోట్ల రుణ బకాయిలను వసూలు చేయాల్సి ఉండగా, కేవలం రూ.73.50 కోట్లకే రెండు ఏఆర్‌సీలతో రాజీకి రావడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా రుణాల పరిష్కార ప్రక్రియపై పలు ప్రశ్నలు లేవనెత్తింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ)తో పాటు ఇతర సంబంధిత వర్గాలకు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది.

వివరాలు 

'ఇది సమర్థనీయం కాదు'

విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ''పన్ను చెల్లింపుదారుల సొమ్మును, ప్రజల డబ్బును సేకరించి బాధ్యతారహితంగా రుణాలుగా ఇవ్వడం, ఆ తర్వాత వాటి వసూళ్ల కోసం సరైన చర్యలు తీసుకోకపోవడం వ్యాపార విధానంగా మారితే అది ఏ మాత్రం సమర్థనీయం కాదు'' అని స్పష్టం చేసింది. ఏఆర్‌సీల పనితీరుపైనా పరిశీలన అవసరం ఆస్తుల పునర్నిర్మాణ సంస్థల పనితీరును కూడా సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. రుణ బకాయిల పరిష్కార విధానంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Advertisement