Same sex marriage: స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేక వివాహ చట్టం అవసరం: సుప్రీంకోర్టు
స్వలింగ వివాహాలకు చట్టభద్రత కల్పించడంపై సుప్రీంకోర్టు మంగళవారం తీర్పును ఇచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులో మొత్తం నాలుగు తీర్పులను ఇచ్చింది. లింగమార్పిడి చేసుకోని వ్యక్తులు (స్త్రీ లేదా పురుషుడు) వివాహం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. లింగ వివక్షతో వీరిని వివాహ బంధంలోకి వెళ్లకుండా అడ్డుకోలేమని చెప్పింది. అయితే ఇప్పుడు తాము ఇచ్చే ఆదేశాలు ఒక చట్టాన్ని రూపొందించడానికి ఉపయోగపడవని వెల్లడించింది.
చట్టాలను రూపొందించే బాధ్యత పార్లమెంట్‌దే: సుప్రీంకోర్టు
చట్టాలను రూపొందించే బాధ్యత పార్లమెంట్, రాష్ట్ర శాసన సభలకే ఉంటుందని స్పష్టం చేసింది. అందుకే స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేక వివాహ చట్టాన్ని తీసుకురావాల్సి ఉంటుందని సీజేఐ స్పష్టం చేశారు. ప్రత్యేక వివాహ చట్టాన్ని రూపొందించాల్సిన బాధ్యత పార్లమెంట్ పైనే ఉందని సీజేఐ వివరించారు. వివాహ వ్యవస్థను స్థిరమైనదిగా, అది ఇక మార్చలేము అనే భావన ఉండకూడదని సీజేఐ అన్నారు. ఇది వరకు వివాహ చట్టంలో అనేక మార్పులు చేసినట్లు సీజేఐ గుర్తు చేశారు. స్వలింగ వివాహం అనేది పట్టణాలకు సంబంధించిన, ఉన్నత వర్గాలకు మాత్రమే చెందినది అనే భావన సరికాదని ధర్మాసనం పేర్కొంది.
స్వలింగ వివాహాలను గుర్తించనందున అవి చట్టవిరుద్ధం కాదు: సుప్రీంకోర్టు
లైంగిక ధోరణిని సాకుగా చూపి స్వలింగ సంపర్కుల పట్ల వివక్ష చూపడం భావ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. కొత్త వివాహ సంస్థను ఏర్పాటు చేయమని పార్లమెంట్ లేదా రాష్ట్రాల అసెంబ్లీలను సుప్రీంకోర్టు బలవంతం చేయదని సీజేఐ నొక్కి చెప్పారు. స్వలింగ వివాహాలను గుర్తించనందున అవి, చట్టవిరుద్ధమైనవి చెప్పలేమని పేర్కొన్నారు. ఒక వేళ వివాహ చట్టాన్ని ఏర్పాటు చేయకపోతే, ఆ నిర్ణయం దేశాన్ని స్వాతంత్ర్య పూర్వ యుగానికి తీసుకెళ్తుందని సీజేఐ వివరించారు.
పెళ్లికాని జంటలు, స్వలింగ జంటలు పిల్లలను దత్తత తీసుకోవచ్చు: సుప్రీంకోర్టు
పెళ్లికాని జంటలు, స్వలింగ జంటలు బిడ్డలను దత్తత తీసుకోడవంపై కూడా సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేృతృత్వంలోని ధర్మాసనం కీలక తీర్పు చెప్పింది. పెళ్లికాని జంటలు, స్వలింగ జంటలు పిల్లలను దత్తత తీసుకోవచ్చని స్పష్టం తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ నియంత్రణ 5(3)పై ఘాటైన వ్యాఖ్యను చేసింది. ఇది ఆర్టికల్ 15ను ఉల్లంఘించడమేనని పేర్కొంది. జేజే చట్టం పెళ్లికాని జంటలను దత్తత తీసుకోకుండా నిరోధించిందని సీజేఐ అన్నారు. ఈ చట్టం పిల్లల ఉత్తమ ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని నిరూపించడంలో కేంద్రం విఫలమైందని పేర్కొంది.